చలి.. గుండె అలజడి
కరీంనగర్: జిల్లాను చలి వణికిస్తోంది. చలితో శ్వాసకోశ, చర్మవ్యాధులతో పాటు హార్ట్‌ఎటాక్, బ్రెయిన్ స్ట్రోక్‌లు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నా రు. అధిక చలితో రక్తనాళాలు కుచించుకుపోయి రక్త ప్రసరణలో ఇబ్బందులు ఏర్పడడంతో హార్ట్‌ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. మారిన జీవనశైలిలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. షుగర్, బీపీ, కిడ్నీ వ్యాధులు, కేన్సర్, టీబీ తదితర వ్యాధులతో బాధపడే వారు మరింత జాగ్రత్త తీసుకోవాలంటున్నారు. గుండెపోటుకు చలి ఒక కారణమైనప్పటికీ ఇతర కారణాలు ఉన్నాయి. రక్తంలో కొలెస్ట్రాల్, హైబీపీ, అదుపులో లేని షుగర్, చిన్నప్పటి నుంచే గుండె సంబంధ సమస్యలు ఉండే వారు హార్ట్‌ఎటాక్‌కు గురవుతారు. మామూలు రోజుల్లో కన్నా చలికాలంలో హార్ట్ ఎటాక్‌లు ఎక్కువగా వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
చలికాలంలో గుండె సమస్యలు
చలి ఎక్కువగా ఉన్నప్పుడు రక్త నాళాలు కుచించుకుంటాయి. దీంతో బీపీ పెరుగుతుంది. గుండె మరింత శక్తిగా పనిచేయాల్సి వస్తుంది. ఇది గుండె వ్యాధిగ్రస్తులకు ప్రమాదకరం. చలిలో రక్తం కొంచెం మందంగా మారి రక్త గడ్డలు (క్లాట్స్) ఏర్పడే అవకాశం పెరుగుతుంది. దీంతో హార్ట్ అటాక్, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. చలితో శరీరం వేడిగా ఉంచేందుకు ఎక్కువ కేలరీలు, ఎక్కువ ఆక్సిజన్ అవసరం పడుతుంది. దీంతో గుండైపె భారం పెరుగుతుంది. జలుబు, ఫ్లూ, శ్వాస సమస్యలు పెరిగి గుండె సంబంధిత సమస్యల్ని మరింత తీవ్రతరం చేస్తాయి. చలికాలంలో వ్యాయామం తగ్గిపోవడం, బరువు పెరగడం, కొలెస్ట్రాల్ పెరగడం గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. చలికాలంలో రక్తపోటు సాధారణంగా పెరుగుతుంది. హై బీపీతో హార్ట్ ఎటాక్ ప్రమాదం ఉంటుంది.
గుండెపోటు ఇలా
గుండెకు ప్రధానంగా మూడు దమనుల ద్వారా రక్తసరఫరా జరుగుతుంది. వీటిలో ఏ రక్తనాళం మూసుకుపోయినా గుండె కండరాలకు అందాల్సిన రక్తం అందక గుండె పోటు వస్తుంది. ఇలాంటప్పుడు సమయానికి హాస్పిటల్‌కు తీసుకెళ్తే బాధితులను బతికించేందుకు అవకాశముంటుంది. కార్డియాక్ అరెస్ట్ జరిగిన తర్వాత హాస్పిటల్‌కు తీసుకెళ్లడం ఎంత ముఖ్యమో... సీపీఆర్ ప్రక్రియపై అవగాహన ఉన్నవారు సీపీఆర్ చేయడం కూడా అంతే ముఖ్యం.
‘చొప్పదండి ప్రాంతానికి చెందిన 54 ఏళ్ల వ్యక్తికి ఈనెల 3న వేకువజామున హఠాత్తుగా గుండెల్లో నొప్పి వచ్చింది. కుటుంబసభ్యులు హుటాహుటిన కరీంనగర్‌లో ని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, సకాలంలో వైద్యం అందడంతో ప్రాణాలు నిలిచాయి.’
‘నగరంలోని కిసాన్‌నగర్‌కు చెందిన 42 ఏళ్ల ప్రైవేటు ఉద్యోగికి అర్ధరాత్రి ఎడమచేయి లాగ డం, చాతిలో నుంచి వీపులోకి నొప్పి రావడంతో కుటుంబసభ్యులు మొదటి ప్రభుత్వాసుపత్రికి, ఆ తర్వాత ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్యం అందించడంతో కోలుకున్నాడు.’


