ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
● కలెక్టర్ పమేలా సత్పతి
తిమ్మాపూర్: ఎన్నికల విధుల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. సోమవారం తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్, కొత్తపల్లి గ్రామపంచాయతీల్లో నామినేషన్ల ప్రక్రియను తనిఖీ చేశారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, అప్పిళ్ల పరిష్కారం, గుర్తుల కేటాయింపు, పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. సర్పంచ్ అభ్యర్థి, వార్డు సభ్యుల నామినేషన్ దాఖలును రోజు వారీగా ఆన్‌లైన్లో నమోదు చేయాలన్నారు. ప్రతీ చిన్న అంశాన్ని అనుమానాలకు తావులేకుండా పూర్తి స్థాయిలో అభ్యర్థులకు వివరించాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు జరుగకుండా పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని, క్షేత్ర స్థాయిలో ఎన్నికల సిబ్బంది పనితీరును పర్యవేక్షించాలని ఆదేశించారు.
కరీంనగర్: స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు చేపడతామని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ హెచ్చరించారు. సోమవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో నిర్వహించిన అడ్వయిజరీ కమిటీ సమావేశంలో మాట్లాడారు. లింగ నిర్ధారణ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించిన 7 స్కానింగ్ సెంటర్లకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు. ఎవరైనా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే వారి సమాచారాన్ని నేరుగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలోని 98499 02501 టోల్‌ఫ్రీ నంబర్‌కు, స్వయంగా తెలియజేయాలని కోరారు. జిల్లాలోని స్కానింగ్ సెంటర్లను నిరంతరాయంగా తనిఖీ చేస్తున్నట్లు వెల్లడించారు. కమిటీ సభ్యులు డీఐవో డాక్టర్ సాజిద, సన జవేరియా, ఎంసీహెచ్ హెచ్‌వోడీ, గైనకాలజిస్ట్, పీడియాట్రిక్ వైద్యులు, డెమో రాజగోపాల్, హెల్త్ ఎడ్యుకేటర్ సరస్వతి తదితరులు పాల్గొన్నారు.
కొత్తపల్లి(కరీంనగర్): దుర్శేడ్ విద్యుత్ సబ్‌స్టేషన్ నుంచి కరీంనగర్ వావిలాలపల్లిలోని 132 సబ్‌స్టేషన్‌కు ప్రస్తుతమున్న ఏసీఎస్‌ఆర్ కండక్టర్ హైటెన్షన్ తీగలకు బదులుగా హెచ్‌టీఎల్‌ఎస్ కండక్టర్ తీగలు అందుబాటులోకి వచ్చాయని టీజీఎన్‌పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్‌ఈ రమేశ్‌బాబు తెలిపారు. ఈ విద్యుత్ తీగలు ఎత్తులో ఉండి గ్రౌండ్ క్లియరెన్స్ పెరగడంతో పాటు ప్రమాదాలు తగ్గేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. హెచ్‌టీఎల్‌ఎస్ కండక్టర్ లైన్ ద్వారా లైన్ సామర్థ్యం రెండున్నర రెట్లు పెరుగుతుందని, దీంతో వేసవిలో నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరాకు ఈ తీగలు ఉపయోగపడతాయన్నారు. ఎక్కడైనా ప్రమాకరంగా విద్యుత్ తీగలుంటే విద్యుత్ శాఖ దృష్టికి తీసుకువస్తే తగు చర్యలు తీసుకుంటామని ఎస్‌ఈ పేర్కొన్నారు.
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ అడిషనల్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టుకు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పని చేస్తున్న మంచికట్ల రాజేశంకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ నియామక ఉత్తర్వులు అందజేశారు. ప్రస్తుతం రాజేశం పాస్ట్‌ట్రాక్ కోర్టు–2 స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి


