నల్లా కనెక్షన్‌.. నయా దందా | - | Sakshi
Sakshi News home page

నల్లా కనెక్షన్‌.. నయా దందా

Nov 17 2025 8:40 AM | Updated on Nov 17 2025 8:40 AM

నల్లా కనెక్షన్‌.. నయా దందా

నల్లా కనెక్షన్‌.. నయా దందా

బల్దియాలో కొత్త నల్లాకు రూ.10వేలు

గంప గుత్తగా వసూలు

అన్ని కేటగిరీల్లో వాటాలు

కాసులిస్తే.. నో రూల్స్‌

బల్దియాలో జోరుగా నల్లా దందా

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరపాలకసంస్థ పరిధిలో నల్లా కనెక్షన్లు కొందరు సిబ్బంది, అధికారులకు కాసులు కురిపిస్తున్నాయి. ఓ వైపు నల్లాల అక్రమాలను సరిచేసేందుకు స్పెషల్‌ డ్రైవ్‌ చేస్తుండగా, మరోవైపు కొత్త కనెక్షన్ల దందా యథేచ్ఛగా సాగుతోంది. ఆన్‌లైన్‌, రోడ్‌ కటింగ్‌, కనెక్షన్‌ పేరిట జనా ల నుంచి రూ.10 వేలు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. కిందిస్థాయి సిబ్బంది నుంచి పైస్థాయి వర కు ఎవరి వాటా వారికున్నట్లు ఆరోపణలున్నాయి.

నల్లా కనెక్షన్‌ రూ.900

కొత్తగా నల్లా కనెక్షన్‌ తీసుకొనే గృహ యజమానులు రూ.900 చెల్లించాలి. కనెక్షన్‌కు రూ.100, మూ డు నెలల అడ్వాన్స్‌ రూ.300, ఇతరత్రా చార్జీలు రూ.500 ఉంటాయి. ఇంటి యజమాని ముందుగా ఆధార్‌కార్డు, ఇంటిపన్ను చెల్లించిన రశీదు, నిర్ణీత ఫారంకు జత చేసి దరఖాస్తు చేసుకోవాలి. ఏఈ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం ఆన్‌లైన్‌కు సిఫారసు చేస్తారు. ఈఈ, ఎస్‌ఈ స్థాయిలో ఆన్‌లైన్‌ మంజూరు వస్తుంది. అప్పుడు రూ.900 చెల్లిస్తే నల్లా కనెక్షన్‌కు ప్రొసీడింగ్‌ జారీ చేస్తారు. అనంతరం పైప్‌లైన్‌ నుంచి తన ఇంటికి నల్లా కనెక్షన్‌ కోసం రోడ్డు ఉంటే కటింగ్‌ చేసుకోవడం, ఇతరత్రా సామగ్రిని యజమాని సమకూర్చుకొంటే సిబ్బంది వచ్చి కనెక్షన్‌ ఇస్తారు.

గంప గుత్తగా రూ.10 వేలు

కొత్తగా నల్లా కనెక్షన్‌ కావాలంటే రూ.900 చెల్లించి, పైప్‌లైన్‌ వేసుకుంటే సంబంధిత ఇంటియజమానికి సరిపోతుంది. కాని ఆన్‌లైన్‌, రోడ్‌ కటింగ్‌, పనోళ్ల కూలీలు తదితర సాకులతో గంపగుత్తగా ఒక్కో కనెక్షన్‌కు రూ.10 వేలు వసూలు చేస్తున్నారు. కూలీలు, ఫిట్టర్లు, లైన్‌మెన్‌లు, కింది నుంచి పైస్థాయి వరకు అధికారులకు వాటాల లెక్కలతో అనధికారికంగా ప్యాకేజీ రూ.10 వేలుగా నిర్ణయించారు.

సిండికేట్‌తో పరేషాన్‌

నగరంలో గతంలో ఉన్న మిషన్‌ భగీరథ స్థానంలో కొత్తగా అమృత్‌ పథకం అమలవుతుండడంతో కొత్త నల్లా కనెక్షన్లు భారీగా పెరిగిపోయాయి. హైలెవెల్‌ జోన్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌ రిజర్వాయర్‌ పరిధిలో సీతారాంపూర్‌, ఆరెపల్లి, రేకుర్తి తదితర ప్రాంతాల్లో నల్లా కొత్త కనెక్షన్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఇదే అదనుగా సిబ్బంది, అధికారుల దందా జోరుగా సాగుతున్నట్లు ఫిర్యాదులున్నాయి. ఇంటి యజమానులు సొంతంగా పనులు చేయించుకోవడానికి కూడా వీలు లేకుండా పోయింది. నల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు రోడ్లు తవ్వడానికి, పైప్‌లైన్లు వేయడానికి అవసరమైన కూలీలు, కనెక్షన్లు ఇచ్చే సిబ్బంది సిండికేట్‌గా మారడంతో, ఇంటి యజమాని సొంతంగా పనులు చేసుకొనే అవకాశం లేకుండా పో యింది. సిండికేట్‌ మూలంగా అనివార్యంగా సిబ్బంది చెప్పిన కూలీలనే పెట్టుకోవాల్సి వస్తోంది. ఇందుకోసం తప్పనిసరిగా రూ.10 వేలు ముట్టచెప్పాల్సి ఉంటుంది. సిండికేట్‌ మాట కాదని సొంతంగా పైప్‌లైన్‌ కోసం తవ్వితే, ఏదో ఒక వంకతో కనెక్షన్‌ ఇవ్వకుండా రోజుల తరబడి తిప్పుకోవడం ఇక్కడ సర్వసాధారణమైంది.

కాసులిస్తే...నో రూల్స్‌

ఇంటి యజమాని సొంతంగాపైప్‌లైన్‌ వేసుకొంటే ఎక్కడ లేని రూల్స్‌ చెప్పే అధికారులు, డబ్బులిస్తే రూల్స్‌ను పక్కనపెడుతున్నారు. నిబంధనల ప్రకా రం మెయిన్‌ (సప్లయి) పైప్‌లైన్‌లకు నేరుగా కనెక్షన్‌లు ఇవ్వడం విరుద్ధం. నిర్ణీత సైజులోనే అంటే, ఆఫ్‌ ఇంచ్‌ పైప్‌లు మాత్రమే ఇంటి కనెక్షన్‌కు ఉపయోగించాలి. సిబ్బంది ద్వారా అధికారులను మచ్చిక చేసుకొంటే ఇవేవీ ఉండవు. అవసరమైతే మెయిన్‌ పైప్‌లైన్‌కు కూడా నేరుగా కనెక్షన్‌లు ఇచ్చిన ఘటనలు నగరంలో కోకోల్లలు. కోర్టు ట్యాంక్‌ ముందు ఇలా సప్లయి పైప్‌లైన్‌కు గతంలో నేరుగా కనెక్షన్‌లు ఇచ్చారు. దీంతో ఆ ప్రాంతంలో ఇప్పటికీ సప్లయి కొనసాగినంత వరకు నల్లా విపరీతమైన ఫ్రెషర్‌తో వస్తూనే ఉంటుంది. ఇండ్లకు నల్లా కనెక్షన్‌ ఇచ్చేందుకు ఆఫ్‌ ఇంచు పైప్‌లు మాత్రమే వాడాల్సి ఉండగా, ‘ప్యాకేజీ’ని పెంచితే ముప్పావు సైజులో కనెక్షన్‌ ఇస్తున్నారు. అధికారులే దగ్గరుండి ఏకంగా సీసీ రోడ్డులను కట్‌ చేయించి కనెక్షన్లు ఇప్పిస్తుంటారు.

అక్రమాలు వెలుగు చూసేనా...

బల్దియాలో నల్లాల వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ఇటీవల నగరపాలకసంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌ ఆదేశాల మేరకు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టారు. గృహ కనెక్షన్ల పేరిట తీసుకున్న కమర్షియల్‌ కనెక్షన్లు గుర్తించి జరిమానా విధించడం, రద్దు చేయడం, నల్లా బకాయిలను వసూలు చేయడం లక్ష్యంగా ఈ డ్రైవ్‌ కొనసాగుతోంది. కొంతమంది ఫిట్టర్లు, లైన్‌మెన్‌లు, ఏఈ,డీఈ,ఈఈ స్థాయి అధికారుల అక్రమాలపైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి నల్లా కనెక్షన్‌కు ఇంత అని వాటాలు పంచుకొని అక్రమాలకు తెరలేపుతున్న ఇంటి దొంగలను గుర్తిస్తేనే స్పెషల్‌ డ్రైవ్‌ లక్ష్యం నెరవేరే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement