సైబర్ నేరగాళ్ల ఉచ్చు నుంచి స్వదేశానికి..
రాయికల్: మయన్మార్ దేశంలో సైబర్ నేరగాళ్ల శిబిరాల్లో చిక్కుకున్న జగిత్యాల జిల్లా రాయికల్‌కు చెందిన ఇద్దరు స్వదేశానికి చేరుకున్నారు. పట్టణానికి చెందిన మొసరపు రాజు నాలుగు నెలల క్రితం మయన్మార్ వెళ్లాడు. మంచి పని దొరికిందని కుటుంబ సభ్యులకు ఫోన్‌ద్వారా తెలిపాడు. తర్వాత అక్కడి వాళ్లు చిత్రహింసలు పెడుతున్నారని, తను ఇండియాకు వస్తానో..? లేదో..?అని కన్నీరుమున్నీరయ్యాడు. రూ.నాలుగు లక్షలు ఇస్తే స్వదేశానికి పంపిస్తామని అంటున్నారని తన భార్య నవ్యశ్రీతో తెలిపాడు. నెలరోజులుగా రాజు నుంచి ఎలాంటి సమాచారమూ లేదు. మయన్మార్ దేశం వెళ్తున్నట్టు తమకు చెప్పలేదని, అక్కడికి వెళ్లాక తీవ్ర ఇబ్బంది పడుతున్నాడని, అక్కడివాళ్లు చెప్పిన పని చేయకుంటే చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు చెప్పేవాడని, తన భర్తను త్వరగా గుర్తించి తమ వద్దకు చేర్చాలని రాజు భార్య నవ్యశ్రీ, తల్లి సత్తమ్మ ప్రభుత్వాన్ని వేడుకున్నారు. పట్టణానికే చెందిన గణేష్‌చంద్ర కూడా మయన్మార్ వెళ్లాడు. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికి.. అక్కడికి వెళ్లిన తర్వాత సైబర్ నేరగాళ్లకు అప్పగించారని స్థానికులు తెలిపారు. వీరి ఇబ్బందులు తెలుసుకున్న కేంద్రప్రభుత్వం.. వారిని విడిపించి ఆయా రాష్ట్రాలకు సమాచారం అందించింది. ప్రస్తుతం బాధితులిద్దరూ ఢిల్లీ చేరుకున్నట్లు సమాచారం.
సైబర్ నేరగాళ్ల ఉచ్చు నుంచి స్వదేశానికి..


