కూతురింటికి వస్తూ మృత్యువాత
బోయినపల్లి(చొప్పదండి): తెల్లవారితే కూతురు ఇందిరమ్మ ఇల్లు స్లాబ్ పోస్తుందని ఆనందంతో వేములవాడ రూరల్ మండలం నూకలమర్రికి చెందిన మేడుదుల దేవయ్య (70) ఆటోలో వస్తుండగా బైక్ ఢీ కొనడంతో మృతిచెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో శనివారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. జగ్గారావుపల్లి గ్రామానికి చెందిన లావణ్య గంగమల్లు ఆదివారం ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి స్లాబ్ పోసుకుంటామని దేవయ్యను రమ్మని చెప్పారు. ఈ క్రమంలో దేవయ్య నూకలమర్రి నుంచి కొదురుపాక వరకు బస్‌లో వచ్చాడు. అక్కడి నుంచి జగ్గారావుపల్లి వెళ్లేందుకు ఆటో ఎక్కగా, అందులో డ్రైవర్ శ్రీనివాస్, ప్రయాణికులు విజయ, రాములు ఉన్నారు. ఆటో కొదురుపాక పెట్రోల్‌బంక్ పరిసరాల్లోకి వచ్చేసరికి ఎదురుగా బైక్‌పై వస్తున్న వేములవాడ మండలం నాంపెల్లికి చెందిన ప్రవీణ్ ఢీకొట్టాడు. దీంతో ఆటోలో ఉన్న దేవయ్య కాలు పూర్తిగా కట్ అయింది. 108లో వేములవాడ ఆసుపత్రికి తరలించగా మృతిచెందాడు. ఆటో డ్రైవర్, బైక్‌పై ఉన్న వ్యక్తికి తీవ్ర, విజయ, రాములుకు స్వల్ప గాయాలయ్యాయి. నలుగురిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. కాగా, బైక్‌పై వస్తున్న వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు నమోదు చేసుకున్నారు.


