పచ్చి మోసం!
కల్లాల వద్దే కాంటా.. మిల్లులకు తరలింపు
క్వింటాల్‌కు రూ.1,600–రూ.1,850 చెల్లింపు
జమ్మికుంటలో అక్రమంగా మిల్లర్లు, దళారుల వ్యాపారం
రాష్ట్రం దాటిస్తూ.. సొమ్ము చేసుకుంటున్న వైనం
పట్టింపు లేని అధికారులు.. ప్రభుత్వ ఆదాయానికి గండి
‘ఇతని పేరు తిప్పారపు సురేశ్. గ్రామం పెద్దంపల్లి, మండలం జమ్మికుంట. రెండెకరాల్లో వరి పంట వేశాడు. వర్షాలు ఎక్కువ కురుస్తుండడంతో ముందుగా వరి కోతలు చేపట్టగా 53 క్వింటాళ్ల ధాన్యం చేతికి వచ్చింది. ఇంకా ఐకేపీ సెంటర్లు ప్రారంభం కాకపోవడం, వడ్లు ఆరబెట్టేందుకు స్థలం లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో పచ్చివడ్లను క్వింటాల్‌కు రూ.1,850 చొప్పున మిల్లులో అమ్ముకున్నాడు’.
జమ్మికుంట(హుజూరాబాద్): ప్రకృతి వైపరీత్యాలు, రైతుల అవసరాలను ఆసరా చేసుకున్న మిల్లర్లు పచ్చివడ్ల కొనుగోళ్లతో దోపిడీకి తెరలేపారు. వరికోతలు మొదలవగానే దళారులు, మధ్యవర్తులు పెట్టుకొని మాయమాటలతో రైతులకు ఎర వేస్తూ కల్లాల వద్దె కాంటా పెడుతున్నారు. క్వింటాల్‌కు రూ.1,600 నుంచి రూ.1,850 చొప్పున పచ్చివడ్లు కొంటూ దళారీ దందాకు తెరలేపారు. పచ్చివడ్ల కొనుగోలు పేరుతో రైతుల రెక్కల కష్టాన్ని క్వింటాల్‌కు రూ.600 వరకు సొమ్ము చేసుకుంటున్నారు. ఎలాంటి రికార్డులు, అనుమతులు లేకుండా అక్రమంగా కొనుగోళ్లు చేస్తూ జీరో దందాకు తెరలేపారు. కొందరు లారీల్లో రాష్ట్రాలు దాటిస్తుండగా, మరికొందరు మిల్లుల్లోనే మరాడిస్తున్నారు. గతంలో పచ్చివడ్లను లారీల్లో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్న సందర్భాలు జమ్మికుంటలో వెలుగుచూశాయి. పచ్చివడ్ల కొనుగోళ్లపై అధికారుల పర్యవేక్షణ కరువైందని, విచారణ చేపడితే అక్రమాలు బయటపడుతాయని పలువురు చర్చించుకుంటున్నారు.
జమ్మికుంట కేంద్రంగా..
సుమారు 20 మండలాల పరిధిలోని రైతులు, గ్రామాల వారికి జమ్మికుంట పట్టణం వ్యాపార కేంద్రంగా ఉంది. వ్యవసాయ ఉత్పత్తులు, అమ్మకాల్లో అక్రమ వ్యాపారాలకు అడ్డాగా మారుతూ వస్తోంది. తాజాగా ఎలాంటి అనుమతులు లేకుండా పచ్చివడ్ల వ్యాపారం కొనసాగుతోంది. ధాన్యం అమ్మడానికి తంటాలు పడుతున్న రైతులను ఆసరా చేసుకొని, దళారులు, వ్యాపారులు పచ్చి వడ్ల దందా మొదలుపెట్టారు.
క్యాన్‌వాసింగ్ వ్యాపారులే ఏజెంట్లు
ప్రభుత్వ సెంటర్లలో కొనుగోళ్ల జాప్యాన్ని ఆసరాగా చేసుకొని వ్యాపారులు కల్లాల వద్ద పచ్చివడ్లను కొంటూ అక్రమంగా రాష్ట్రం దాటవేస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,369 ఉండగా దళారులు రూ. 1,600 నుంచి రూ.1,850 చెల్లిస్తున్నారు. ఈ తతంగమంతా క్యాన్‌వాసింగ్ ఏజెంట్లు, మధ్యవర్తుల కనుసన్నల్లో నడుస్తోంది.
ప్రభుత్వ ఆదాయానికి గండి
అక్రమంగా కొనుగోలు చేసిన వడ్లను చెక్‌పోస్ట్ కళ్లు గప్పి రాష్ట్రం దాటిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. కాగా, అడ్డుకున్న అధికారులను మచ్చిక చేసుకొని మామూళ్లు ముట్టజెప్పుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పచ్చి మోసం!
పచ్చి మోసం!


