నేర ప్రవృత్తి.. దూస్తోంది కత్తి!
కమిషనరేట్‌లో 18 ఠాణాలు.. 578 రౌడీషీటర్లు
పోలీసుల ప్రత్యేక నిఘా
ఇప్పటికే 15 మందిపై పీడీయాక్టు
నెలకోసారి పోలీసుస్టేషన్లలో హాజరు
నిజామాబాద్, హైదరాబాద్ ఘటనలతో మరింత అప్రమత్తం
నిజామాబాద్‌లో ఇటీవల బైక్ దొంగతనం కేసులో రియాజ్ అనే రౌడీషీటర్‌ను పట్టుకుని బైక్‌పై స్టేషన్‌కు తీసుకెళ్తున్న క్రమంలో ప్రమోద్ అనే కానిస్టేబుల్‌ను కత్తితో పొడవడంతో ప్రాణాలు వదిలాడు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో సౌత్, ఈస్ట్‌జోన్ డీసీపీ చైతన్యపై దోపిడీ దొంగలు కత్తితో దాడికి యత్నించారు. దీంతో డీసీపీ వారిపై రెండు రౌండ్ల కాల్పలు జరపగా... ఒకరు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో రౌడీషీటర్లు, చైన్‌స్నాచర్లపై ఉక్కుపాదం మోపుతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కరీంనగర్ కమిషనరేట్‌లోని 18 ఠాణాల పరిధిలో 578 రౌడీషీటర్లు ఉండగా.. పాతనేరస్తులు, హిస్టరీషీటర్లు, చోరీలకు పాల్పడేవారు, సంఘ విద్రోహశక్తులపై నిఘా పెంచారు.
కరీంనగర్‌క్రైం: కమిషనరేట్‌లో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీషీటర్లపై నిఘా పెంచారు. వరుస నేరాలకు పాల్పడుతున్న వారిపై రౌడీ, హిస్టరీ షీట్లు తెరుస్తున్నారు. వీరి కదలికలపై దృష్టి పెడుతూ.. ప్రతినెల తమ పరిధిలోని పోలీసుస్టేషన్లలో కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, మార్పు కనిపిస్తే రౌడీషీట్లు మూసివేస్తామని సున్నితంగా హెచ్చరిస్తున్నారు.
జిల్లాలో 578 మంది రౌడీషీటర్లు
కమిషనరేట్‌వ్యాప్తంగా వివిధ నేరాలకు పాల్పడిన 578 మందిపై పోలీసులు ఇప్పటికే రౌడీషీట్లు తెరిచారు. వీరిలో తీవ్రమైన నేరప్రవృత్తి కలిగిన 15మందిపై పీడీయాక్టు అమలు చేసి, జైలుకు పంపించారు. రౌడీషీటర్లపై నిఘా పెంచుతూ, సంఘ విద్రోహచర్యలకు పాల్పడేవారిపై ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టాలని నిర్ణయించారు. రికార్డులో ఉన్న ప్రతీ రౌడీషీటర్‌ను వ్యక్తిగతంగా పిలిపించి, వారి ప్రస్తుత జీవన పరిస్థితులపై వివరాలు సేకరిస్తున్నారు. ప్రత్యేక పరిస్థితులు ఏర్పడినప్పుడు బైండోవర్ చేస్తున్నారు. కాగా.. చాలా మంది రౌడీషీటర్లకు రాజకీయ నాయకుల అండదండలు ఉంటున్నాయనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.
నేరాలు పునరావృతం
కొంతమంది రౌడీషీటర్లు తీరుమార్చుకుని, ప్రస్తుతం చట్టబద్ధంగా జీవనం కొనసాగిస్తుండగా, మరికొందరు వరుస నేరాలకు పాల్పడే ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు వారిని వేరుచేసి మళ్లీ నేరాల్లోకి వెళ్లేవారిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. బ్లూకోల్ట్స్, పెట్రోలింగ్ సిబ్బందితో రౌడీషీటర్లు నివసించే ప్రాంతాలు, వారి కదలికలపై నిఘా పెడుతూ.. ఆ సమాచారాన్ని ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారు.


