నల్లా కనెక్షన్లపై స్పెషల్ డ్రైవ్
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో నల్లా కనెక్షన్లపై స్పెషల్‌డ్రైవ్ నిర్వహించాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్‌దేశాయి ఆదేశించారు. శనివారం నగరపాలకసంస్థ కార్యాలయంలో ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. నగరపాలకసంస్థ పరిధిలో తాగునీటి నల్లా కనెక్షన్ల వివరాల సేకరణకు సర్వే చేయాలన్నారు. విలీన గ్రామాల డివిజన్లతో సహా, నగరవ్యాప్తంగా నల్లా కనెక్షన్ల వివరాలను ఆన్‌లైన్ చేయాలన్నారు. రిజర్వాయర్ల పరిధిలో సరఫరా వారీగా కమర్షియల్, రెసిడెన్షియల్, డబుల్ నల్లా కనెక్షన్లు, ట్యాన్ నంబర్ల ప్రకారం వివరాలు సేకరించాలన్నారు. నల్లా కనెక్షన్ పొందిన ప్రకారం, పైప్ ఇంచులవారీగా వివరాలు నిర్ణీత ఫార్మాట్‌లో అందించాలన్నారు. గృహావసరాలకు నల్లా కనెక్షన్లు తీసుకుని, వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న నల్లాలను కమర్షియల్ కేటగిరీకి మార్చాలన్నారు. అక్రమ నల్లాలను నియంత్రించాలన్నారు. ట్యాన్ నంబర్ లేకుండా నల్లా కనెక్షన్ ఉంటే అక్రమ నల్లాగా గుర్తించి, రెగ్యులరైజ్ చేసుకోవడానికి నోటీసులు ఇవ్వాలన్నారు. నల్లా పన్నుల బకాయిలు వసూలు చేయాలన్నారు. బకాయి చెల్లించని వారికి నోటీసులు జారీ చేసి, చెల్లించకుంటే నల్లా కనెక్షన్లు తొలగించాలన్నారు. అక్రమ నల్లాలను తొలగించాలన్నారు. అదేవిధంగా నగరవ్యాప్తంగా వీధిదీపాల నిర్వహణ సక్రమంగా నిర్వర్తించాలని అన్నారు. ఎస్‌ఈ రాజ్‌కుమార్, ఈఈలు యాదగిరి, సంజీవ్ కుమార్, డీఈలు ఓంప్రకాశ్, లచ్చిరెడ్డి, దేవేందర్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, అయూబ్ ఖాన్ పాల్గొన్నారు.


