అర్బన్‌బ్యాంక్‌పై జెండా ఎగురవేస్తాం
కొత్తపల్లి(కరీంనగర్)/కరీంనగర్ కార్పొరేషన్: కాంగ్రెస్ భావాలు కలిగిన వ్యక్తులతో అర్బన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్యానెల్‌ను రూపొందించినట్లు కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. కొత్తపల్లిలోని వెలిచాల ప్రజా కార్యాలయంలో మాట్లాడుతూ ప్రత్యేక ప్రాధాన్యత కలిగిన అర్బన్ బ్యాంక్‌ను కొంతమంది భ్రష్టు పట్టించారని, డిపాజిటర్లు, ఖాతాదారులు అభద్రతకు లోనయ్యేలా అవినీతి అరోపణలతో వివాదాలు సృష్టించారని ఆరోపించారు. రూ.72 కోట్ల డిపాజిట్లు, పదివేల మందికి పైగా సభ్యులు కలిగిన అర్బన్‌బ్యాంక్‌పై మంచి విశ్వాసం కలిగేలా చక్కని కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. అందులో భాగంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్ రావు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ సహకారంతో ప్యానెల్‌ను తయారు చేసి పోటీలో నిలిపినట్లు పేర్కొన్నారు. అర్బన్ బ్యాంకు ఖాతాదారులు, సభ్యులు తమ ప్యానల్‌ను ఆదరించాలని కోరారు. బ్యాంకు ప్యానల్ అభ్యర్థులు మూల వెంకట రవీందర్‌రెడ్డి, ఈ.లక్ష్మణ్ రాజు, అనురాసు కుమార్, వజీర్ అహ్మద్, ఉయ్యాల ఆనందం, చిందం శ్రీనివాస్, నార్ల శ్రీనివాస్, గాదె కార్తీక్, కూసరి అనిల్‌కుమార్, మన్నె అనంత రాజు, మునిపల్లి ఫణిత, దామెర శ్రీలతరెడ్డి పాల్గొన్నారు.


