ఉద్యోగం వదిలి.. పండ్లతోట వైపు
పెద్దపల్లిరూరల్: ఎంబీఏ చదివి రెండేళ్ల పాటు హైదరాబాద్‌లో ఉద్యోగం చేసి.. ఆ ఉద్యోగాన్ని వదలుకుని తమకున్న 13 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు యువరైతు. అందులో రెండున్నర ఎకరాల్లో సేంద్రియ పద్ధతిలో డ్రాగన్‌ఫ్రూట్ పండిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు పెద్దపల్లి మండలం రంగాపూర్‌కు చెందిన గండు నరేశ్. డ్రాగన్‌ప్రూట్ పంటకు అనువుగా భూమిని మార్చేందుకు దాదాపు రూ.6లక్షలతో మట్టిని పోయించాడు. రెండున్నర ఎకరాల్లో 4,500 మొక్కలు నాటించాడు. నాటినవాటిలో 500 మొక్కల వరకు పాడై పోగా వాటిస్థానంలో కొత్తవి నాటించాడు. డ్రాగన్‌ఫ్రూట్ ఏటా జూన్ నుంచి నవంబర్ దాక దిగుబడి వస్తుంది. ఒకసారి నాటిన మొక్క 30 ఏళ్ల పాటు దిగుబడినిస్తుంది. ప్రస్తుత సీజన్‌లో వాతావరణ పరిస్థితుల కారణంగా దిగుబడిపై ప్రభావం చూపిందని రైతు వాపోయాడు.
తోటవద్దే అమ్మకాలు
పెద్దపల్లి–మంథని ప్రధానరోడ్డు పక్కనే తోట ఉంది. కొనుగోలుదారులకు తోట నుంచి తెంపుకొచ్చిన పండును కిలో రూ.200 చొప్పున అమ్ముతున్న. చాలా మంది కొంటున్నారు. పంట సాగు సమయంలో ప్రభుత్వం రాయితీ ఇస్తుందని హార్టికల్చర్ చెప్పినా ఇప్పటికీ రాలేదు. ప్రభుత్వం పండ్ల తోటలకు రాయితీ ఇచ్చి ప్రోత్సహించాలి.
– నరేశ్, రైతు
ఉద్యోగం వదిలి.. పండ్లతోట వైపు


