
మెటాఫండ్ ప్రో నిర్వాహకులపై కేసు నమోదు
జగిత్యాలక్రైం: జగిత్యాలకు చెందిన ఓ వ్యక్తిని మెటాఫండ్ ప్రో యాప్‌లో పెట్టుబడి పెడితే మూడింతల లాభం వస్తుందని నమ్మించి మోసం చేసిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై రవికిరణ్ తెలిపారు. బాధితుడికి జగిత్యాలకు చెందిన కస్తూరి రాకేశ్ 2024లో పరిచయమయ్యాడు. రాకేశ్‌తో పాటు హైదరాబాద్‌కు చెందిన వారాల లోకేశ్ కలిసి క్రిప్టోలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించారు. దశలవారీగా రూ.80.50 లక్షలు పెట్టుబడి పెట్టించారు. యాప్ మూతపడటంతో బాధితుడు రాకేశ్, లోకేశ్‌ను డబ్బులు చెల్లించాలని కోరగా దాటవేస్తూ వచ్చారు. ఇటీవల గట్టిగా నిలదీయడంతో రాకేశ్, లోకేశ్ బాధితుడినే చంపుతామంటూ బెదిరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రాకేశ్, లోకేశ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు
మేడిపల్లి: భీమారం మండలం గోవిందారం–మోత్కురావుపేట గ్రామాల మధ్య శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు కథనం ప్రకారం.. దేశాయిపేటకు చెందిన దొంతి మధు తన ద్విచక్ర వాహనంపై మోత్కురావుపేట వెళ్తున్నాడు. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించబోయి కిందపడ్డాడు. తల, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. మేడిపల్లి ఎస్త్సె శ్రీధర్ రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించి మూలమలుపు వద్ద ప్రమాదకరంగా ఉన్న చెట్లను స్థానిక పంచాయతీ కార్యదర్శి సహాయంతో తొలగించారు.