
భీమన్న సన్నిధి.. భక్తుల సందడి
● బాలాలయంలో రాజన్న దర్శనాలు ● కోడెమొక్కుల చెల్లింపులు
● సౌకర్యాలపై భక్తుల సంతృప్తి ● రాజన్న ఆలయం అభివృద్ధిపై హర్షం
వేములవాడ: వేములవాడ శ్రీరాజరాజేశ్వర ఆలయ విస్తరణ పనుల నేపథ్యంలో భీమన్న ఆలయంలో దర్శనం, కోడెమొక్కులకు కల్పించిన సౌకర్యాలపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాలాలయంలో దర్శనాలకు ఏర్పాట్లు బాగున్నాయని.. కోడెమొక్కులు సైతం ఇక్కడే చెల్లించుకోవడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈనెల 11న స్వామి వారి ఉత్సవమూర్తులను భీమన్నగుడిలోని బాలాలయంలో ప్రతిష్ఠించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇక్కడే దర్శనాలు, కోడెమొక్కులు చెల్లించుకుంటున్నారు. రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆలయాన్ని అభివృద్ధి చేయడాన్ని స్వాగతిస్తున్నారు. భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. అదే సమయంలో భీమన్నగుడిలో చేసిన ఏర్పాట్లపై సంతృప్తిగా ఉందన్నారు. భీమన్నగుడిలో దర్శనాలు పూర్తి చేసుకున్న భక్తులు శ్రీసాక్షిశ్రీతో మాట్లాడారు. వారి మాటల్లోనే..
రాజన్న గుడిని విస్తరిస్తున్న క్రమంలో భీమన్నగుడిలో దర్శనాలు ఏర్పాటు చేయడం బాగుంది. ఇక్కడే దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నాం. భీమన్నగుడిలోనూ సౌకర్యాలు బాగా కల్పించారు. ఎన్నో ఏండ్లకు వేములవాడ రాజన్న గుడి అభివృద్ధి జరుగుతుందంటే సంతోషంగా ఉంది.
– కాటం సత్యం–లక్ష్మి, సెంటినరీకాలనీ
రాజన్న గుడి విస్తరణ పనుల్లో భాగంగా భీమన్నగుడిలో దర్శనాలకు మంచి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి. అందరూ అధికారులకు సహకరిస్తే భవిష్యత్‌లో రాజన్న ఆలయం చరిత్రలో నిలిచిపోయేలా తయారవుతుంది.
– మహిపాల్‌రెడ్డి, కొత్తగూడెం, జనగామ జిల్లా
రాజన్న దర్శనానికి వస్తే భీమన్న గుడిలో దర్శనం చేసుకోవాలన్నారు. భీమన్నగుడికి వస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనాలు సాగాయి. రాజన్న ఆలయ విస్తరణ పనులు చేపడుతున్న ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు.
– మహేశ్వర్, ముణ్యాల్, నిర్మల్