
రైతు కష్టం.. వర్షంతో నష్టం
వర్షంతో తీవ్ర నష్టం
వీణవంక: వానాకాలం వరి కోతలు ప్రారంభమయ్యాయి. రైతులు కోతల్లో నిమగ్నమవగా.. రైతులను వర్షాలు వెంటాడుతున్నాయి. పంట చేతికొచ్చే సమయంలో వానలు కురుస్తుండడం రైతులను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కొన్నిచోట్ల వరి కోతలు ఊపందుకోగా.. కళ్లాల వద్ద ధాన్యం ఆరబోశారు. సోమవారం జిల్లావ్యాప్తంగా ఓ మోస్తరు వర్షం పడడంతో ఆరబోసిన ధాన్యం తడిసింది. ధాన్యం కాపాడుకోవడానికి రైతులు నానా తంటాలు పడ్డారు. కొన్ని మండలాల్లో వర్షానికి వరి అక్కడక్కడ నేలకొరిగింది. దీంతో పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుందని రైతులు కలవరపడుతున్నారు. అల్పపీడన ప్రభావంతో మరో 3 రోజులు వానలుంటాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో.. రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. దిగుబడిపై తీవ్ర ప్రభావం పడనుందని వాపోతున్నారు. వివిధ తెగుళ్లతో పరేషాన్ అవుతుండగా.. వాన మరింత భయాందోళనకు గురి చేస్తోంది. జిల్లావ్యాప్తంగా 2.76లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఇందులో 60వేల ఎకరాల్లో కోతలు పూర్తి కాగా.. కోత దశలో 1.20లక్షల ఎకరాలున్నాయి.
మూడేళ్లుగా ఇదే పరిస్థితి
ఉత్తర తెలంగాణలోనే వరి సాగులో కరీంనగర్ జిల్లా మొదటి స్థానంలో ఉంది. ఇక్కడి నేలలు వరి పంటకు అనుకూలంగా ఉండడంతో.. రైతులు ఈ పంట వైపే మొగ్గు చూపుతున్నారు. కంపెనీలు సైతం పోటీ పడి విత్తనాలిస్తున్నాయి. మూడేళ్లుగా వరి చేతికొచ్చే సమయంలో వడగండ్లు, అకాల వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. దీంతో దిగుబడి తగ్గిపోవడంతోపాటు వరి కోత యంత్రాల ఖర్చు తడిసి మోపడువుతోంది. పెట్టిన పెట్టుబడి భారంగా మారిందని వీణవంక మండలం ఘన్ముక్కుల గ్రామానికి చెందిన రైతు మధుసూదన్‌రెడ్డి వాపోయాడు. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. కొన్ని మండలాల్లో పైరు నేలకొరిగింది.
తడారని పొలాలు
నేలకొరిగిన పొలంలో నీరు నిల్వ ఉండడంతో గింజలు మురిగిపోయే ప్రమాదముంది. నీరు నిల్వ ఉండకుండా కాల్వల ద్వారా తోడేయాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. దోమతోపాటు వివిధ రకాల తెగుళ్లు విజృంభించే అవకాశముంది. ఇప్పటికే పొలాలు తడారడం లేదు. ఎకరాకు రూ.25వేల పెట్టుబడి పెట్టారు. ఎకరాకు 40 బస్తాల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు.
భయం గుప్పిట్లో వరి రైతు
కోతల సమయంలో రైతులను వెంటాడుతున్న వర్షాలు
సోమవారం కురిసిన వానకు తడిసిన ధాన్యం
అక్కడక్కడ నేలకొరిగిన పైరు
ఈ సమయంలో వర్షాలు పడితే పంటకు తీవ్ర నష్టం
మరో 3 రోజులు వానలుంటాయన్న వాతావరణ శాఖ
జిల్లాలో 2.76లక్షల ఎకరాల్లో వరి సాగు
8 ఎకరాల్లో దొడ్డు రకం వరి పంట వేసిన. వారం క్రితం వరి కోయాల్సి ఉండగా.. పొలం తడారలేదు. ఇంతలో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం కురిసిన వానకు 10 రోజుల వరకు తడారని పరిస్థితి. దిగుబడి వచ్చేట్టు లేదు. గింజలు నేలరాలిపోయే ప్రమాదముంది. ఇప్పటికే ఎకరాకు రూ.30వేల పెట్టుబడి పెట్టాం.
– కలకొండ మధూకర్‌రెడ్డి, రైతు, మల్లన్నపల్లి,

రైతు కష్టం.. వర్షంతో నష్టం