
బంగారం కోసమే విష ప్రయోగం
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తిలో వృద్ధ దంపతులపై జరిగిన విషప్రయోగం మిస్టరీ వీడింది. ఈ ఘటనలో వృద్ధుడు చనిపోగా.. వృద్ధురాలు ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తెలిసిన వ్యక్తే బంగారం కోసం మత్తు మాత్రలు ఇవ్వగా.. నిందితుడిని గంగాధర పోలీసులు అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను సీపీ గౌస్ ఆలం సోమవారం కమిషనరేట్ కార్యాలయంలో వెల్లడించారు. గర్శకుర్తి గ్రామానికి చెందిన గజ్జెల శంకరయ్య– లక్ష్మీ దంపతులు ఇంట్లో ఇద్దరే ఉంటారు. వారి ఇంటికి సమీపంలో ఉండే కత్తి శివ(37) వృద్దులకు చేదోడుగా ఉంటూ మందులు తేవడం, ఇతర పనులు చేస్తుండేవాడు. శివకు పేకాట, ఆన్‌లైన్ గేమ్స్ ఆడడంతో అప్పులయ్యాయి. అప్పు తీర్చేందుకు దంపతుల వద్ద బంగారం కాజేయాలని నిర్ణయించాడు. గతంలో ముంబైలో కల్లుడిపోలో పనిచేసిన సమయంలో అందులో వాడే మత్తు టాబ్లెట్లు వెంట తెచ్చుకున్నాడు. ఈ నెల 7వ తేదీన వృద్ధులకు అనారోగ్యం ఉండడంతో మత్తు టాబ్లెట్లు ఇచ్చాడు. అవి వేసుకుంటే జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులు తగ్గుతాయని నమ్మించాడు. మాత్రలు వేసుకుని సొమ్మసిల్లిన రెండు గంటల తర్వాత ఇంట్లోకి వెళ్లి లక్ష్మి మెడలోని బంగారు పుస్తెలతాడు ఎత్తుకెళ్లాడు. అదే గ్రామంలోని కట్ల శ్రీనివాసాచారికి విక్రయించి, రూ.1.85 లక్షలు తీసుకున్నాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న గంగాధర పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శివపై ఆనుమానంతో అతని కదలికలపై నిఘా పెంచారు. సోమవారం గర్శకుర్తి శివారులో అదుపులోకి తీసుకున్నారు. తానే వృద్ధులకు మత్తుమాత్రలు ఇచ్చి, బంగారం చోరీ చేశానని ఒప్పుకున్నాడు. అతని నుంచి రూ.25వేల నగదు, 11మత్తు మాత్రలు, సెల్‌ఫోన్, కట్ల శ్రీనివాసాచారి నుంచి పుస్తెలతాడు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన రూరల్ ఏసీపీ విజయ్‌కుమార్, చొప్పదండి సీఐ ప్రదీప్‌కుమార్, గంగాధర ఎస్సై వంశీకృష్ణ, హెడ్‌కానిస్టేబుల్ చారి, కానిస్టేబుళ్లు జంపన్న, అరవింద్‌ను సీపీ అభినందించి రివార్డు అందించారు.
వీడిన గర్శకుర్తి వృద్ధ దంపతుల మిస్టరీ
మత్తు మాత్రలు ఇచ్చిన తెలిసిన వ్యక్తి
ఆపై బంగారం అపహరణ
కేసును ఛేదించిన పోలీసులు
వివరాలు వెల్లడించిన సీపీ గౌస్ ఆలం