
రైతును రాజు చేయడమే లక్ష్యం
తిమ్మాపూర్: రైతులను రారాజును చేయడమే మోదీ లక్ష్యమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. నల్లగొండ గ్రామంలోని కరీంనగర్ మిల్క్ డెయిరీ వద్ద శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రైతుల పక్షపాతని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో యూరియా ధరలు ఆకాశాన్నంటుతున్నా.. అదనపు ఖర్చును కేంద్రం భరిస్తూ సబ్సిడీ ధరకే యూరియా అందజేస్తోందని చెప్పారు. ధన్ ధాన్య కృషి యోజన ద్వారా 1.7కోట్ల రైతులకు లాభాలు కల్పించేందుకు ఏటా రూ.24వేల కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు వివరించారు.
ఆటోమెటిక్ పెరుగు కేంద్రం ప్రారంభం
జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ(జికా) ఆర్థిక సహకారంతో రూ.90.70కోట్ల వ్యయంతో నిర్మించిన ఆటోమెటిక్ కర్డ్ ప్లాంట్‌ను బండి సంజయ్ ప్రారంభించారు. ఇది 1.5లక్షల లీటర్ల పెరుగు ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉందని తెలిపారు. కరీంనగర్ డెయిరీ 27 ఏళ్ల చరిత్ర కలిగి, ప్రతిరోజు 2లక్షల లీటర్ల పాలు, 40లక్షల లీటర్ల పెరుగు విక్రయించడం గొప్ప విషయమన్నారు. మోదీ ప్రభుత్వం 2021లోనే 3లక్షల లీటర్ల పాల ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు డెయిరీకి సహాయం అందించిందని గుర్తు చేశారు. గతంలో డెయిరీ ఆస్తులపై కబ్జా ప్రయత్నాలు జరిగినప్పుడు ఆస్తిని రక్షించేందుకు ఉద్యమాలు చేశామన్నారు. వరి కనీస మద్దతు ధర 2014లో రూ.1,310 ఉండగా.. ప్రస్తుతం రూ.2,360కి పెంచామని తెలిపారు. అమెరికా, చైనా, రష్యా నాయకులతో ప్రధాని సమావేశాలు జరిపి దేశ ప్రయోజనాల కోసం స్పష్టమైన సంకేతాలిచ్చారని చెప్పారు. కరీంనగర్ మాజీ మేయర్ సునీల్‌రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, డెయిరీ ప్రతినిధులు, నాయకులు ఇనుకొండ నాగేశ్వర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, సుగుర్తి జగదీశ్వరచారి, వేల్పుల ఓదెలుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.