
టెక్నాలజీ.. మానవీయం
కరీంనగర్‌టౌన్: కరీంనగర్‌లోని వీ–కన్వెన్షన్ హాల్ వేదికగా జరిగిన తెలంగాణ 9వ రాష్ట్ర ఫిజీషియన్ సదస్సు శనివారం ప్రారంభం కాగా మొదటిరోజు వైభవంగా జరిగింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన అనుభవజ్ఞులైన వైద్యులు, పరిశోధకులు సదస్సులో ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తం 1,200 మంది డెలిగేట్లు హాజరుకాగా, వారిలో స్పెషలిస్టులు, పీజీ విద్యార్థులు, ఫ్రెష్ గ్రాడ్యుయేట్లు తమకు అవసరమైన నైపుణ్యాలను పొందే అవకాశం దక్కించుకున్నారు.
టెక్నాలజీ– మానవీయత మేళవింపు
నిబద్ధతగల వైద్యుడికి టెక్నాలజీ, మానవీయత రెండూ అవసరం. రెండింటినీ సమన్వయం చేయాలని నిర్వాహకులు పేర్కొన్నారు. వైద్య సేవలో పరస్పర సంబంధం, రోగి స్థితిగతులపై లోతుగా అవగాహన, ఆధునిక టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవడం తదితర అంశాలపై చర్చ జరిగింది.
కొత్త సవాళ్లను ఎదుర్కోవాలి
వైద్య రంగంలో ఎదురయ్యే కొత్త సవాళ్లను ఎదుర్కోవడం, క్లినికల్ డెసిషన్ మేకింగ్, డిజిటల్ హెల్త్ టూల్స్ వినియోగం, రిసెర్చ్ ఆధారిత చికిత్సలపై తమ అనుభవాలను జాతీయ ఏపీఐ చైర్మన్ డాక్టర్ నర్సింహులు, వైద్యులు నందిని ఛటర్జీ, రవికీర్తి, ఎంవీ రావు, ఎ.శ్రీనివాస్‌కుమార్, గోపాల్‌కృష్ణ గోఖలే, నరసింహన్, వసంత్‌కుమార్, నాగార్జున మాటూరి వంటి ప్రముఖులు వివరించారు. కార్యక్రమానికి ఆర్గనైజింగ్ చైర్మన్‌గా డాక్టర్ తిరుపతిరావు, సెక్రటరీగా డాక్టర్ విజయ్‌మోహన్‌రెడ్డి, ట్రెజరర్‌గా వైద్యులు చైతన్య, రఘురామన్, జె.సురేశ్, వెంకటరెడ్డి, వెంకటేశ్వర్లు, ప్రశాంతి వ్యవహరించారు.