
నేటి ప్రజావాణి రద్దు
కరీంనగర్ అర్బన్: జిల్లాలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందనే వాతావరణ శాఖ సూచనలు, జిల్లాలోని పలు చోట్ల సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్న సందర్భంగా ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు గమనించి ప్రజావాణికి రావద్దని సూచించారు.
నాలుగు జెడ్పీస్థానాలు మాదిగలకు కేటాయించాలి
కరీంనగర్: ప్రభుత్వం స్థానిక సంస్థల రిజర్వేషన్లు ప్రకటించిన నేపథ్యంలో ఆరు జిల్లా పరిషత్ స్థానా ల్లో నాలుగు మాదిగ సామాజికవర్గానికి కేటాయించాలని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లాకేంద్రంలో రాష్ట్ర అధికార ప్రతినిధి ఎల్కపల్లి రాజేందర్ అధ్యకతన జరిగిన మాదిగ హక్కుల దండోరా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో గౌరవ అధ్యక్షుడు పెరుమాండ్ల రామకృష్ణతో కలిసి మాట్లాడారు. మాదిగలకు వార్డు మెంబర్ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు, నామినేట్ పదవుల్లో వాటా దక్కాలని కోరారు. మొండి చేయి చూపిస్తే ఆ పార్టీల ఓటమికి మాదిగ హక్కుల దండోరా పని చేస్తోందన్నారు. రాష్ట్ర మహిళా విభాగ సమన్వయకర్త అందేలా భవానిరెడ్డి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎలుకటి జనార్దన్, ఖవంపల్లి రవి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మేతరి రోజా రాణి, జిల్లా అధ్యక్షుడు మాట్ల రమేష్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మంతెన స్వామి, చిలుక రాజేశం, సప్పిపోచన్న, తాటిపల్లి బాపు పాల్గొన్నారు.