
పూలు.. పాటల జాతర
తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ వేడుక
అతివల మనసులో పూలపల్లకీ
సద్దుల సంబరాల్లో జిల్లా మహిళలు
సిరిసిల్ల: ప్రకృతిని పూజించే సంస్కృతి తెలంగాణకే సొంతం. పూలనే దేవతగా కొలిచే భక్తితత్వం ఇక్కడి మట్టి మనుషుల సొంతం. తమ భక్తిని.. ఇష్టాన్ని జానపదాలలో తెలుపుతూ సాగే సాహిత్యం ఇక్కడి జనజీవనాన్ని ప్రతిబింబింపజేస్తుంది. ఈ మట్టిమనుషులు పూజించే బతుకమ్మ సంబరాలు పల్లె, పట్నం అనే తేడా లేకుండా జోరుగా సాగుతున్నాయి. సద్దుల సంబరాలకు సిద్ధమవుతున్నారు. వేములవాడలో ఏడు రోజుల్లో శనివారం చేస్తుండగా, మిగతా ప్రాంతాల్లో తొమ్మిది రోజులు.. మరికొన్ని ఏరియాల్లో దసరా మరుసటి రోజు సద్దులు సంబరాలు చేసేందుకు అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఈ పండగ విశిష్టతలపై ప్రత్యేక కథనం.
తీరొక్క పూలజాతర
పితృ అమావాస్య నాడు పెద్దలకు బియ్యం ఇచ్చినప్పటి నుంచి రోజుకో పేరుతో.. సద్దితో ఎనిమిది రోజులు బొడ్డెమ్మగా జరుపుకొని తొమ్మిది దినాల నాడు పెద్దబతుకమ్మ, సద్దుల బతుకమ్మగా సాగనంపే పండుగ ఇది. పొద్దంతా పనిచేసి సాయంత్రం ఇంటికొచ్చే ముందు అడవిలోని రకరకాల పూలు తెచ్చి సిబ్బిలో పేర్చి పసుపు ముద్ద, గుమ్మడి పూల గౌరమ్మను చేసి మధ్యలో ఉంచి చుట్టూ తిరిగి చప్పట్లు కొడుతూ ఆడుతూ సంబురంగా జరుపుకుంటారు. ప్రకృతిలో పూసే ప్రతీ పువ్వు బతుకమ్మకు అలంకారమే. చివరి రోజు సద్దుల బతుకమ్మ. ఊరంతా పూల జాతరగా మారుతుంది.
తంగేడు, గుమ్మడి ప్రధానం
బతుకమ్మకు ప్రతీక తంగేడు, గుమ్మడి పూలు. గుమ్మడిని గౌరమ్మగా నిలిపితే, తంగేడును బతుకమ్మగా పేరుస్తారు. తంగేడు చెట్టు తెలంగాణ పల్లె ప్రజల జీవన విధానాన్ని పోలి ఉంటుంది. నీలు లేని చెలకలో గుట్టల మీద, రాళ్ల నడుమ గాలికి ఎండకు తట్టుకుని నిలిచి తలెత్తుకునే కష్టజీవి తంగేడు చెట్టు. తెంపిన చాలా సేపటి వరకు వాడిపోని దివ్యఔషధం. ఊరి శివారుల్లోని చెలకలు, గుడ్డాలు, అటవీ భూముల్లో తంగేడు, గునుగు, గుమ్మడిపూలు విరివిగా లభిస్తాయి.
కమ్మనైన అమ్మపాట బతుకమ్మ
సామాజిక చరిత్రను, ఇతిహాసాలను, అన్నచెల్లెళ్ల అనుబంధాన్ని పాటల రూపంలో చెప్తారు. పాటంటే తెలంగాణ ఎత, కథ తలపోత. నవ్వినా.. ఏడ్చినా కన్నీళ్లే వచ్చినట్లు.. కష్టమైనా సుఖమైనా.. పంటపండినా.. బతుకు ఎండినా.. తెలంగాణలో అది పాటే అవుతుంది. పూర్వకాలంలో తెలంగాణలో సీ్త్రలు దొరలు, భూస్వాములు, వత్తేదార్ల కింద అష్టకష్టాలు పడేవారు. వాళ్ల కష్టాలను పాటల రూపంలో చెప్పుకోవడానికి ఈ పండుగ వేదికగా నిలిచింది. ఇది లిఖిత సాహిత్యం కాదు. సద్దుల బతుకమ్మ రోజు గౌరమ్మను సాగనంపేందుకు తీసుకెళ్లే పలహారాలు కాయ, పండ్లు, పిండిధాన్యాలే. ఈ పండుగ కాలం నాటికి పునాసపంటలు.. మక్కలు, జొన్నలు, బబ్బెర్లు, పెసర్లు, పల్లీలు, మినుములు ఇంట్లోకి వస్తాయి. వాటినే నైవేద్యంగా పెట్టి తినడం ఆచారంగా మారింది.
గుడి లేని పండుగ
ఎన్నో కష్టాలు ఉంటాయని పండుగలోని పాటలు చెబుతాయి. కష్టాలకు, కన్నీళ్లకు వెరవకుండా నిలవాలని తంగేడు చెట్టు చెబుతోంది. మనమంతా ప్రకృతి జీవనంలో ఓ భాగమేనని పండుగ విధానం చెబుతోంది. వెరసి బతుకమ్మ పండుగ బతికి గెలవాలని.. గెలిచి నిలవాలని హితబోధ చేస్తోంది. ఏ పండుగకు ఎలా ఉన్నా ఈ పండక్కి మాత్రం ఆడకూతుళ్ల చూపు తల్లిగారింటి వైపు ఉంటుంది. ఇంత వైభవంగా భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ పండక్కి ఓ గుడిలేదు.. స్తోత్రంలేదు.. శ్లోకం అంతకంటే లేదు. ప్రజల కష్టాలే పాటలు.. దొరికిన పూలే రూపాలు.. ఇంట్లోని ధాన్యాలే నైవేద్యాలు. ఇంతటి విశిష్టతను కలిగిన బతుకమ్మ పండగా ఇంటింటా సందడిని నింపింది.
ఊరుకో తీరుగా..
బతుకమ్మ పండగను ఊరుకో తీరుగా నిర్వహిస్తున్నారు. రాజన్న కొలువైన వేములవాడలో ఏడు రోజులకే సద్దుల బతుకమ్మను సాగునంపుతారు. రుద్రంగి మండల కేంద్రంలో దసరా పండుగ తరువాత సద్దుల బతుకమ్మను నిర్వహిస్తారు. సిరిసిల్లతోపాటు అన్ని ప్రాంతాల్లోనూ నవరాత్రులతో సద్దుల బతుకమ్మను జరుపుకుంటారు. ఇలా ఊరుకో తీరుగా.. ప్రాంతానికో విధంగా పూల పండగను నిర్వహిస్తారు. ఎలా నిర్వహించినా.. బతుకమ్మ పేర్చే విధానం.. కొలిచే తీరు ఒక్కటే. అదే ప్రకృతి పూల బతుకమ్మ.