
‘పట్టు’ సాధించారు
జిల్లాలో 147 ఎకరాల్లో మల్బరీ సాగు
పట్టుపురుగుల పెంపకానికి సర్కార్ సాయం
లాభాలు గడిస్తున్న రైతులు
పట్టు పురుగుల పెంపకంపై జిల్లాకు అవార్డు
షెడ్ల నిర్మాణానికి ప్రభుత్వ సబ్సిడీ
ముస్తాబాద్(సిరిసిల్ల): పట్టు అంటేనే పవిత్ర భావన. పట్టు వస్త్రాలు ధరిస్తే వచ్చే హుందాతనం వేరు. వివాహాది శుభకార్యాలలో పట్టు బట్టలకు ప్రాధాన్యం అంతా.. ఇంతా కాదు. అలాంటి పట్టు వస్త్రాల తయారీకి మూలమైన మల్బరీ తోటలు, పట్టుపురుగుల పెంపకానికి కేరాఫ్‌గా జిల్లా మారబోతోంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 147 ఎకరాల్లో మల్బరీతోటలను రైతులు పెంచుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలతో రైతులు ‘పట్టు’ సాధిస్తున్నారు. 38 షెడ్లలో పట్టు పురుగుల పెంపకాన్ని చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం మేరా రేషమ్.. మేరా అభియాన్ ద్వారా రైతులకు శిక్షణ ఇవ్వడంతో ఆసక్తి చూపారు. జిల్లాలో పట్టుపరిశ్రమ అభివృద్ధికి అడుగులు పడడంతో గణనీయమైన పట్టు ఉత్పత్తి సాధించిన జిల్లాగా ఉత్తమ అవార్డు అందుకున్నారు.
‘పట్టు’ ఇలా సాధించవచ్చు
వరికి ప్రత్యామ్నాయంగా మల్బరీ, పట్టు పురుగుల పెంపకం ద్వారా అధిక లాభాలు ఆర్జించవచ్చు. రెండెకరాలలో రెండు బిట్లుగా మల్బరీతోటను సాగు చేసి, 50, 30 అడుగుల పరిమాణంలో నిర్మించే షెడ్లకు కేంద్రం రూ.3లక్షల సబ్సిడీ ఇస్తుంది. పట్టు పురుగుల గుడ్లు అనగా చాకి పురుగులను సరఫరా చేసే రైతుల నుంచి పట్టు పురుగులు తెచ్చుకోవచ్చు. ఒక షెడ్డులో 1.70లక్షల పట్టు పురుగులను షెడ్డులో పెంచవచ్చు. 23 రోజుల వరకు పురుగులకు మల్బరీ ఆకు వేసి పెంచాలి. అనంతరం వాటిని బ్లాక్ బాక్స్‌ల్లో వేయాలి. వారం రోజులకు పట్టు గూళ్లతో పురుగులు వస్తాయి. ఐదు రోజుల తర్వాత పట్టుగూళ్లను జనగామ జిల్లా కేంద్రంలోని కేంద్ర ప్రభుత్వ పట్టు సేకరణ కేంద్రానికి తరలిస్తారు. కిలో పట్టుగూళ్లకు రూ.500 నుంచి 700 వరకు ధర వస్తుంది. నాణ్యతను బట్టి ధర నిర్ణయిస్తారు. ఒక క్వింటాలు పట్టుగూళ్లకు రూ.55వేల నుంచి రూ.60వేలు పలికే అవకాశం ఉంది. పురుగులు తీసుకొచ్చినప్పటి నుంచి పట్టుగూళ్లు విక్రయించే వరకు సెరికల్చర్ అధికారులు, సైంటిస్టులు రైతులకు అండగా నిలుస్తున్నారు. నెలరోజుల వ్యవధిలో ఒక పంటను తీయవచ్చు. రెండు ఎకరాల మల్బరీ, ఒక షెడ్డు ద్వారా నెల రోజుల్లో రూ.60వేలు ఆర్జించవచ్చు. మల్బరీ మొక్కలు ఒకసారి నాటితే పదేళ్ల వరకు ఉంటాయి.

‘పట్టు’ సాధించారు