కరీంనగర్‌క్రైం: అర్బన్ పోలీసింగ్‌పై దృష్టిపెట్టా లని సీపీ గౌస్ ఆలం సూచించారు. కరీంనగర్ టౌన్ ఏసీపీ కార్యాలయాన్ని బుధవారం తనిఖీ చేశారు. పెండింగ్ కేసులపై సమీక్ష చేశారు. త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. రౌడీ, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, వారి కదలికలను గమనించాలన్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. పెండింగ్ వారెంట్లు అమలు చేయాలన్నారు. గంజాయి, ఇసుక అ క్రమ రవాణా, పీడీఎస్ బియ్యం, పేకాటను కట్టడి చేయాలన్నారు. టౌన్ ఏసీపీ వెంకటస్వామి, సీఐలు రాంచందర్‌రావు, సృజన్‌రెడ్డి, జాన్‌రెడ్డి, శ్రీలత పాల్గొన్నారు.
57 వాహనాల బహిరంగ వేలం
కరీంనగర్ పరిధిలో స్వాధీనం చేసుకున్న 57 ద్విచక్ర వాహనాలను స్క్రాప్ ప్రాతిపదికన ఈనెల 27న బహిరంగ వేలం వేయనున్నట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు సిరిసిల్ల బైపాస్‌లోని పీటీసీలో వేలం ఉంటుందని అన్నారు. ఆసక్తి ఉన్నవారు ఉదయం 11గంటల నుంచి వాహనాలను పరిశీలించుకోవచ్చని, ప్రభుత్వ గుర్తింపుకార్డుతో వేలంలో పాల్గొనాలని సూచించారు.
విద్యుత్ క్రీడాకారులకు అభినందనలు
కొత్తపల్లి(కరీంనగర్): రాష్ట్రవ్యాప్తంగా జరిగిన వివిధ క్రీడాంశాల్లో ట్రోఫీలు సాధించిన టీజీ ఎన్‌పీడీసీఎల్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్రీడాకారులను ఎస్‌ఈ మేక రమేశ్‌బాబు అభినందించారు. స్పోర్ట్స్ కౌన్సిల్ ఉమ్మడి జిల్లా క్రీడా జట్లు ఈ నెలలో వరంగల్‌లో జరిగిన డిస్కం ఇంటర్ సర్కిల్ బ్యాడ్మింటన్, చెస్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచి కప్‌లు సాధించగా, వాటిని బుధవారం కరీంనగర్ సర్కిల్ కార్యాలయంలో ఎస్‌ఈకు అందజేశారు. డీఈలు కె.ఉపేందర్, జంపాల రాజం, లక్ష్మారెడ్డి, తిరుపతి, శ్రీని వాస్, ఎస్‌ఏవో రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
ప్రధాని మోదీకి ధన్యవాదాలు
కరీంనగర్‌టౌన్: ‘జీఎస్టీ సంస్కరణతో వ్యాపా రం పెరిగింది. ఎలక్ట్రానిక్ వస్తువుల ధర తగ్గింది. ప్రధానమంత్రి మోదీకి మా తరఫున థ్యాంక్స్ చెప్పండి’ అంటూ కరీంనగర్‌కు చెందిన పలువురు వ్యాపారులు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌ను కోరారు. మెడికల్, అగ్రికల్చర్ వ్యాపారులు సైతం సంజయ్‌ని కలిసి జీఎస్టీ పన్నుల భారం తగ్గించినందుకు ధన్యవాదాలు తెలిపారు. సంజయ్ మాట్లాడుతూ పండుగల సమయంలో పేద కుటుంబాలకు ఇది నిజమైన బహుమతి అన్నారు. సామాన్య ప్రజలకు మోదీ జీఎస్టీ సంస్కరణలు ఊరట కలిగిస్తున్నాయన్నారు.
ముంబై టు కరీంనగర్.. లోకమాన్య తిలక్ టర్మినస్ రైలు పునః ప్రారంభం
కరీంనగర్‌రూరల్: ముంబై– కరీంనగర్ రైలును అధికారులు పునః ప్రారంభించారు. 2013 వరకు ముంబై నుంచి నిజామాబాద్ వరకు నడిచిన ఎక్స్‌ప్రెస్ రైలును 2018 నుంచి కరీంనగర్ వరకు పొడిగించారు. 2020లో కరోనా సమయంలో రైలును నిలిపివేశారు. మంగళవారం నుంచి ముంబై నుంచి కరీంనగర్‌కు రైలును పున:ప్రారంభించారు. వారానికోసారి ముంబైలోని లోకమాన్య తిలక్ టర్మినస్ నుంచి కరీంనగర్‌కు ప్రత్యేక రైలును నడిపించేందుకు దక్షిణమద్య రైల్వే చర్యలు చేపట్టింది.
ముంబైలోని లోకమాన్య తిలక్ టర్మినస్ స్టేషన్ నుంచి ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3.30గంటలకు రైలు బయల్దేరి మరుసటిరోజు బుధవారం ఉదయం 10 గంటలకు కరీంనగర్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది. అదేరోజు సాయంత్రం 5.30గంటలకు కరీంనగర్ నుంచి ముంబైకి బయల్దేరుతోంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని కోరుట్ల, మెట్‌పల్లి రైల్వేస్టేషన్లలో ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ రైలుకు హాల్టింగ్ ఉందని కరీంనగర్ రైల్వేస్టేషన్ కమర్షియల్ ఇన్స్‌పెక్టర్ భానుచందర్ తెలిపారు.