
కాగుతున్న కల్తీ నూనె
కరీంనగర్ అర్బన్: దసరా పండుగ అక్రమార్కులకు వరంగా మారింది. నూనె వినియోగం ఐదింతలు ఉంటుండగా కల్తీ రక్కసి జడలు విప్పుతోంది. నియంత్రించాల్సిన యంత్రాంగం మామూలుగా వ్యవహరిస్తుండటంతో అక్రమార్కులకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. కరీంనగర్ జిల్లాకేంద్రంగా దసరాకు ముందే కల్తీ కాగుతోంది. అరికట్టాల్సిన ఆహార నియంత్రణశాఖ, తూనికలు, కొలతల శాఖ నామమాత్రంగా మిగలడంతో కల్తీ మాఫియాకు అడ్డుఅదుపు లేకుండా పోయింది.
పండుగ పూట రూ.కోట్లలో దందా
పండుగల సమయంలో వ్యాపారులు వీలైనంత మేర కల్తీ చేసి పొద్దుతిరుగుడు, పల్లీ నూనె పేరుతో విక్రయిస్తున్నారు. దసరా, క్రిస్మస్, సంక్రాంతి, ఏకాదశి పండుగల సమయాల్లో భారీగా వ్యాపారం సాగుతోంది. తక్కువ ధరకు దొరికే వివిధ రకాల నూనెలలను కొనుగోలు చేయడం వాటిని స్వల్ప నాణ్యమైన నూనెలో అధిక మొత్తంలో కలిపి విక్రయిస్తున్నారు. నగరంలోని ప్రకాశంగంజ్, మంకమ్మతోట, రాంనగర్ ప్రాంతాల్లో ఎక్కువగా కల్తీ విక్రయాలు సాగుతున్నాయని సమాచారం. చింతకుంట, బొమ్మకల్, బైపాస్ ప్రాంతాల్లోని గోడౌన్లలో విడినూనెను దించుకోవడం అక్కడి నుంచి ప్యాకెట్లు, డబ్బాల్లో నింపి దుకాణాలకు తరలించడం తంతుగా సాగుతోంది. హుజూరాబాద్, జమ్మికుంట, గంగాధర, తిమ్మాపూర్ ప్రాంతాల్లోని పలువురు వ్యాపారులు భారీగా నిల్వలు చేశారు.
అంతా సోయాబీన్.. సుగంధానికి రసాయనం
ఏ నూనె అయినా కల్తీ చేయడం పలువురు వ్యాపారులకు వెన్నతో పెట్టిన విద్య. హైదరాబాద్, రాజమండ్రి, కాకినాడ ప్రాంతాల నుంచి ట్యాంకర్ల ద్వారా ఎలాంటి వే బిల్లులు లేకుండా నూనెను కరీంనగర్‌కు దిగుమతి చేస్తున్నారు. ఎముకల నూనెను కూడ మిశ్రమంగా వాడుతున్నట్లుగా గతంలో తేలింది. ఇక్కడికి రాగానే తక్కువ ధరకు లభించే సోయాబీన్ నూనెను పొద్దుతిరుగుడు నూనెలో, వేరుశనగ నూనెలో కలుపుతున్నారు. కల్తీ చేసిన నూనెల నుంచి స్వచ్ఛమైన వాసన వచ్చేందుకు రసాయన పదార్థాలను వినియోగిస్తున్నారు. 48కిలోల సోయాబీన్ నూనెలో కేవలం 2 కిలోల పల్లి నూనెను కలిపి మొత్తంగా పల్తి నూనెగా విక్రయిస్తున్నారంటే కల్తీ ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.
సమన్వయలోపం
నాణ్యమైన నూనెల విక్రయాలు, ధరల నియంత్రణ, జీరో వ్యాపారాన్ని నియంత్రించడంలో అధికారుల మధ్య సమన్వయలోపం వ్యాపారులకు కల్పతరువుగా మారింది. ఐదు క్వింటాళ్ల కన్నా ఎక్కువ నూనె నిల్వ చేసుకుంటే పౌరసరఫరాల శాఖ అనుమతి తప్పనిసరి. హోల్‌సేల్ వ్యాపారులు జిల్లాకేంద్రంలో అయితే 600ల క్వింటాళ్లు, ఇతర ప్రాంతాల్లో అయితే 377 క్వింటాళ్లు, జిల్లా కేంద్రంలో రిటైల్ అయితే 50 క్వింటాళ్లు, ఇతర ప్రాంతాల్లో 30 క్వింటాళ్లు నిల్వ చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. అయితే అనుమతి లేని దుకాణాలు వందల్లో ఉన్నాయని తెలుస్తోంది. నిల్వలకు తమకు సంబంధమని పౌరసరఫరాల అధికారులు, కల్తీయే తమకు సంబంధమని ఆహార నియంత్రణ అధికారులు, విక్రయాలకే సంబంధమని వాణిజ్య పన్నులశాఖ అధికారులు చెబుతూ చేతులు దులుపుకుంటున్నారు.