
మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం
తిమ్మాపూర్: మహిళల అభివృద్ధి, సాధికారతే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర,శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. తిమ్మాపూర్ మండలంలోని ఎల్‌ఎండీ కాలనీలో ఉన్న మహిళా ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఆమె, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఆటో డ్రైవింగ్ శిక్షణ, వివిధ వృత్తుల్లో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫి కెట్లు అందజేశారు. మహిళా ప్రాంగణాల ద్వారా భవిష్యత్తులో మరింత మంది మహిళలకు ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపడతామని మంత్రి తెలి పారు. కొత్త జిల్లాల్లో కూడా ప్రాంగణాలు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... మహిళా సంఘాల ద్వారా ఎరువుల పంపిణీని చేపట్టి బలోపేతం చేస్తామన్నారు. మహిళా ప్రాంగణంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీ లిస్తామని, శిక్షణ కార్యక్రమాలు నిరంతరం జరిగేలా అధికారులు చూడాలని సూచించారు. డ్రైవింగ్ శిక్షణ పొందిన మహిళలకు రవాణాశాఖ ఉచిత డ్రైవింగ్ లైసెన్సులు అందజేస్తుందని, మహిళా సంఘాల ద్వారా 47 బస్సులు కొనుగోలుకు సహకరించి, ఆదాయ మార్గాలు సృష్టిస్తామన్నారు. కార్యక్రమంలో భాగంగా బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి సీతక్క, అధికారులు, మహిళలు, అంగన్‌వాడీ టీచర్లతో కలిసి బతుకమ్మ ఆడిపాడారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద, మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్ బండ్రు శోభారాణి, కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ ఆలం, కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
పెండింగ్ బిల్లులు ఇప్పించండి
జిల్లా పోలీస్ అధికారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, ధనసరి సీతక్కలకు వినతిపత్రం సమర్పించారు. సంవత్సర కాలంగా పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల బిల్లులు ఇప్పించాలని కోరారు. జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిడాల సురేందర్, పీసీ నరేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.