
నిబంధనల బూచీ.. కొనుగోళ్లపై పేచీ
కరీంనగర్ అర్బన్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2025–26 సీజను కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) నిర్వహించిన జిన్నింగ్, ప్రెస్సింగ్ టెండర్లకు కాటన్, జిన్నింగ్ మిల్లుల యజమానులు దూరంగా ఉన్నారు. మద్దతు ధరతో ఏటా పత్తిని కొనుగోలు చేసే సీసీఐ జిన్నింగ్ కోసం టెండర్లను ఆహ్వానించింది. మార్క్‌ఫెడ్ మినహా ప్రైవేటు వ్యాపారులు టెండర్లు వేయకపోవడంతో పత్తి క్రయవిక్రయాలపై ప్రభావం చూపే ప్రమాదముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వచ్చే నెలలో పత్తి కొనుగోళ్లు ప్రారంభం కావాల్సి ఉన్నా.. ఇప్పటివరకు టెండర్ల పక్రియ పూర్తికాలేదు.. సీసీఐ నిబంధనలు కఠినంగా ఉండటంతో పత్తి పరిశ్రమ యజమానుల సంఘం తమ మిల్లులను సీసీఐకు అద్దెకు ఇవ్వొద్దనే నిర్ణయం మేరకు ఒక్కరు కూడా టెండర్లు వేయలేదని తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో వానాకాలం సీజన్లో 4లక్షల ఎకరాలకు పైగా పత్తి సాగైంది. అధికారుల లెక్కల మేరకు 40 లక్షల క్వింటాళ్ల పత్తి వచ్చే వీలుంది. మద్దతు ధరతో పత్తిని కొనుగోలు చేసే సీసీఐ పత్తి గింజలు తీసి బేళ్లుగా మార్చి సరఫరా చేయడానికి టెండర్లు ఆహ్వానించింది. ఆగస్టు 31 వరకు గడువు ఇవ్వగా.. వ్యాపారులు టెండర్లు వేయలేదు.
కొత్తగా తీసుకొచ్చినవి ఇవే..
ఒక బ్రాంచిలో రెండు, మూడు జోన్లుగా చేసి లింట్ పర్సంటేజ్లో మార్పులు చేయడంతో పాటు గతంలో కంటే ఎక్కువగా పెంచారు. వంద కిలోల పత్తిలో ఏ నెల ఎంత దూది ఇవ్వాలనే నిబంధన పెట్టారు.. గతంలో ఇది నెలవారీగా ఉండేది.. ఈ సీజన్లో నెలలో రెండు సార్లు ఇవ్వాలని సూచించారు. బేలు తయారు చేసే సమయంలో గతంలో లోటు (షార్టేజ్) 3.15 నుంచి 1.90 శాతం ఉండేది.. దాన్ని 1.25 నుంచి 0.75 శాతానికి తగ్గించారు. నిబంధనలు, బేళ్ల ధర, జిన్నింగ్లో సౌకర్యాలు, తదితర వాటిపై చర్చలు జరిపిన తర్వాతనే టెండర్లకు వెళ్తామని కాటన్ అసోసియేషన్ అంటోంది.
పత్తి విక్రయాలు సజావుగా సాగేనా
జిల్లాలో 40వేల ఎకరాలకు పైగా పత్తి సాగు చేశారు. 4లక్షల క్వింటాళ్లకు పైగా దిగుబడి రానుండగా కనీస మద్దతు ధర అందాలంటే ప్రభుత్వ సత్వర నిర్ణయాలే పరిష్కారం. మరో పక్షం రోజుల్లో పంట దిగుబడులు మార్కెట్‌ను ముంచెత్తనుండగా తదనుగుణ చర్యలు కరవయ్యాయి. జిల్లాలో 16జిన్నింగ్ మిల్లులుండగా వాటిలోనే సీసీఐ కొనుగోలు చేయనుంది. ఈ క్రమంలో టెండర్ల ప్రక్రియలో వ్యాపారులు కోట్ చేయకపోవడం, నిబంధనలను బూచీగా చూపి దూరంగా ఉండటంతో కర్శకులకు నష్టమే. ప్రభుత్వం చొరవ చూపి పత్తి విక్రయాలకు మార్గం సుగమం చేయడంతో పాటు మద్దతు ధర అందేలా చూడటం అత్యవసరం.
పత్తి విక్రయాలు సజావుగా సాగేనా?