
అంతర్జాతీయ క్రీడాపోటీలకు సిరిసిల్ల మహిళ
● అభినందించిన రాష్ట్ర క్రీడల శాఖ
మంత్రి వాకిటి శ్రీహరి
● శ్రీలంకలో జరిగే పారాత్రో
పోటీలకు అర్చన
సిరిసిల్ల: జిల్లాకు చెందిన దివ్యాంగురాలు అంతర్జాతీయ క్రీడాపోటీలకు ఎంపికయ్యారు. సిరిసిల్ల శివారులోని చంద్రంపేటకు చెందిన మిట్టపల్లి అర్చన(34) దివ్యాంగురాలు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో 88 శాతం వైకల్యంతో ఉన్న అర్చన పారాత్రో పోటీల్లో తెలంగాణ స్థాయిలో చాంపియన్‌గా నిలిచారు. రాష్ట్రం తరఫున తమిళనాడులోని కోయంబత్తూర్‌లో జరిగిన జాతీయ పోటీల్లోనూ ప్రథమ స్థానంలో నిలిచింది. దేశం తరఫున సౌత్ ఏసియా గేమ్స్‌లో పాల్గొనేందుకు శ్రీలంక రాజధాని కొలంబోకు వెళ్తున్నారు. 2025 డిసెంబరులో జరిగే పారాత్రో గేమ్స్‌లో పాల్గొననున్నారు. క్రీడలపై ఆమెకున్న ఆసక్తి, పట్టుదలను గ్రహించిన జిల్లా బాలల సంక్షేమ అధికారి కవిత రాష్ట్ర క్రీడలు, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని కలిశారు. సౌత్ ఏసియా గేమ్స్‌లో పాల్గొనేందుకు వెళ్తున్న అర్చనను మంత్రి అభినందించారు. ప్రభుత్వపరంగా అర్చనకు సహకారమందిస్తామని హామీ ఇచ్చారు. ఇద్దరు పిల్లల తల్లి అయినా.. పట్టుదలగా ఆమె ఆటల్లో ముందుకు సాగడాన్ని అభినందించారు.