ప్లాట్ల వ్యాపారం ప్రాణం తీసింది | - | Sakshi
Sakshi News home page

ప్లాట్ల వ్యాపారం ప్రాణం తీసింది

Sep 21 2025 5:49 AM | Updated on Sep 21 2025 5:49 AM

ప్లాట

ప్లాట్ల వ్యాపారం ప్రాణం తీసింది

సిరిసిల్ల/వేములవాడ అర్బన్‌: భూ వివాదాల్లో రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన మాజీ కౌన్సిలర్‌ సిరిగిరి రమేశ్‌(55) వేములవాడ కమాన్‌ వద్ద హత్యకు గురయ్యాడు. పాతికేళ్లుగా రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ప్లాట్ల వ్యాపారం చేసిన రమేశ్‌ను చివరికి ఆ వివాదాలే బలి తీసుకున్నాయి. వేములవాడ పట్టణానికి చెందిన ఎద్దండి వెంకటేశ్‌ శుక్రవారం ఉదయం 9 గంటలకు సిరిసిల్ల నుంచి రమేశ్‌ను కారులో తీసుకెళ్లాడు. రాత్రి వరకూ రమేశ్‌ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వేములవాడ–సిరిసిల్ల పట్టణాల మధ్య నందికమాన్‌ వద్ద గల నందీశ్వర వెంచర్‌లో తన కారులోనే హత్యకు గురై కనిపించాడు.

ఎస్‌టీడీ బూత్‌ నుంచి కౌన్సిలర్‌ వరకు..

సిరిసిల్లలోని విమల్‌ టాకీస్‌ ప్రాంతంలో చాలా కాలం ఎస్‌టీడీ బూత్‌ను నిర్వహించిన రమేశ్‌ భాగస్వాములతో కలిసి వేములవాడ, సిరిసిల్ల ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశాడు. ఆర్థికంగా కలిసి రావడంతో సొంతంగా వెంచర్లు ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలోనే సిరిసిల్ల మున్సిపల్‌లో 2005లో ఇండిపెండెంట్‌గా పోటీచేసి కౌన్సిలర్‌గా గెలుపొందాడు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని మరింత విస్తరించి వివాదాల్లో ఇరుకున్నాడు. ఏడాది కాలంగా రమేశ్‌పై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత భూవివాదాలు పరిష్కరించుకుంటుండగా హత్యకు గురయ్యాడు.

ఉలిక్కిపడిన రియల్టర్లు

రెండున్నర దశాబ్దాలుగా రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఉన్న సిరిగిరి రమేశ్‌ హత్యకు గురవడంతో రియల్ట ర్లు ఉలిక్కి పడ్డారు. వేములవాడలో రియల్‌ ఎస్టేట్‌ వివాదాలు ఎక్కువగా ఉండడంతో ఇప్పటికే అనేక హత్యలు భూవివాదాల్లో జరిగాయి. రమేశ్‌ హత్య నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయని పోలీసు వర్గాలు రహస్యంగా ఆరా తీశారు. ప్రధాన నిందితుడు వెంకటేశ్‌ పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. హత్యకేసులో అతనితోపాటు ఇంకా ఎవరు ఉన్నారు? కుట్రదారులు ఎవరైనా ఉన్నారా? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు.

కొడుకు, కూతురు వచ్చేంత వరకు...

రమేశ్‌ భార్య సిరిగిరి అనీల అడ్వకేట్‌. అతని కొడుకు తేజస్విన్‌వర్మ చైన్నెలో, కూతురు చందనశ్రీ ఢిల్లీలో చదువుతున్నారు. ఇద్దరు పిల్లలు వచ్చే వరకు పోస్టుమార్టం వద్దని అనీల స్పష్టం చేయడంతో శనివారం సాయంత్రం వరకు కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్దనే వేచి ఉన్నారు. పిల్లలు రావడంతో పోలీసు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం చేశారు. శవాన్ని సిరిసిల్లలోని అంబేడ్కర్‌నగర్‌కు తరలించారు.

ఎనిమిది మందిపై కేసు

రమేశ్‌ హత్య కేసులో ఎనిమిది మందిపై కేసు నమోదైనట్లు వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి తెలిపారు. మృతుని భార్య అనీల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. వేములవాడకు చెందిన ఎద్దండి వెంకటేశ్‌ తన భర్తను ఇంటి నుంచి తీసుకెళ్లాడని, ఈ హత్య కేసులో ఎద్దండి వెంకటేశ్‌తోపాటు సిరిగిరి మురళి, రాధాకృష్ణ, శేషగిరిరావు, రాము, పాస్టర్‌ వేణు, కుంటయ్య, గంగయ్యతోపాటు మరికొంత మందిపై అనుమానం ఉందని మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి తెలిపారు.

వేములవాడలో హత్య.. సిరిసిల్లలో కలకలం

ఎనిమిది మందిపై కేసు

ప్లాట్ల వ్యాపారం ప్రాణం తీసింది1
1/1

ప్లాట్ల వ్యాపారం ప్రాణం తీసింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement