
నాలాపై పట్టింపేది?
‘నగరంలోని పరివార్‌బేకరీ నుంచి ఫండస్ స్కూల్ వైపు వెళ్లే ప్రధాన దారి అది. విద్యాసంస్థలు, హోటళ్లు, వివిధ దుకాణాలున్న ఈ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ రోడ్డు కింది నుంచే నాలా వెళ్తుంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ నెల 17వ తేదీన అక్కడున్న కేఫ్ ముందే నాలా కూలిపోయింది. ఆ కేఫ్ ముందు చాలా మంది నాలాపై నిలుచొని ఉంటారు. ఆ సమయంలో ఎవరైనా అక్కడే నిలుచొని ఉంటే...పెద్ద ప్రమాదం వాటిల్లేది.’
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని నాలాల పరిస్థితి అధ్వానంగా మారింది. దశాబ్దాల క్రితం నిర్మించిన నాలాలు శిథిలావస్థకు చేరి, ప్రమాదకరంగా మారుతున్నాయి. నివాసాల మధ్య నుంచి వెళ్తున్న చోట ప్రమాదపుటంచునే ప్రజలు కాలం వెళ్లదీస్తున్నారు. ఎప్పుడే ప్రమాదం చోటుచేసుకొంటుందనే ఆందోళనతో ఉంటున్నారు. శిథిలావస్థకు చేరిన నాలాలను పునర్నిర్మాణం చేయాలని స్థానికులు సంవత్సరాలుగా కోరుతున్నా, నగరపాలకసంస్థ ఆ దిశగా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. నగరంలో మూడు నాలాలు ఉన్నాయి. ఒకటి రాంనగర్ నుంచి మంకమ్మతోట, జ్యోతినగర్, ముకరాంపుర, గణేష్‌నగర్, లక్ష్మినగర్ మీదుగా వాగులో కలుస్తుంది. రెండోది వావిలాలపల్లి నుంచి కోర్టు ప్రాంతం, మంచిర్యాల చౌరస్తా, శర్మనగర్, హుస్సేనిపుర మీదుగా సాగుతుంది. మూడోది రాంపూర్ నుంచి అలకాపురికాలనీ, ఆటోనగర్‌ల మీదుగా పోతుంది. సంవత్సరాల క్రితం నిర్మించినవి కావడంతో చాలా చోట్ల నాలాలు శిథిలావస్థలో ఉన్నాయి. ముఖ్యంగా ముకరాంపుర, మంచిర్యాల చౌరస్తా తదితర ప్రాంతాల్లో అధ్వానంగా మారాయి. ముకరాంపురలో ఇటీవల కూలిన నాలాలో మనిషి పడితే కిలోమీటరు దూరం వరకు వెళ్లి తేలాల్సిన పరిస్థితి. ముకరాంపురలో నాలాలో పడితే కలెక్టరేట్‌లో తప్ప మరోచోట నాలా నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు.
నాలాను పునరుద్ధరించాలి
– మాజీ మేయర్ సునీల్‌రావు
పదిరోజుల్లో కూలిన నాలాను పునరుద్దరించాలని మాజీ మేయర్, బీజేపీ నాయకుడు యాదగిరి సునీల్‌రావు డిమాండ్ చేశారు. నాలా కూలిన ప్రాంతాన్ని శుక్రవారం సందర్శించారు. 2001లో నిర్మించిన ఈ పెద్ద మోరీ వర్షాలకు కూలిందన్నారు. టూటౌన్ పోలీసుస్టేషన్ నుంచి కలెక్టర్ కార్యాలయం, అంబేడ్కర్ స్టేడియం, కోతిరాంపూర్ వరకు నాలా ప్రమాదకరంగామారిందన్నారు. అధికారులు వెంటనే మరమ్మతులు చేయాలన్నారు.