
కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య
ముస్తాబాద్(సిరిసిల్ల): కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై గణేశ్ తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంటకు చెందిన కదిరె హరీశ్(29) గురువారం పొలం పనుల కోసం వెళ్లాడు. రాత్రయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో శుక్రవారం ఉదయం వెళ్లి పరిశీలించగా మృతిచెంది ఉన్నాడు. అచేతన స్థితిలో ఉన్న హరీశ్‌ను చూసిన తల్లిదండ్రులు నర్సవ్వ, నర్సయ్య బోరున విలపించారు. వ్యవసాయం చేసుకునే హరీశ్ కుటుంబ సమస్యలతో బాధపడుతున్నాడు. ఈక్రమంలో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి హరీశ్ మనోవేదనకు గురయ్యాడు. తీవ్ర మనస్థాపానికి గురైన హరీశ్ పొలం వద్ద ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి ఇద్దరు కుమారులు. హరీశ్ సోదరుడు పదిహేనేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందగా, ఇప్పుడు హరీశ్ ఆత్మహత్య చేసుకోవడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఆదుకుంటాడనుకున్న కొడుకు అర్ధంతరంగా తనువు చాలించాడని విలపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై గణేశ్ తెలిపారు.
ఎలిగేడు(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ధూళికట్ట గ్రామానికి చెందిన రేండ్ల రమేశ్(22) ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై మధుకర్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రేండ్ల రమేశ్ వివిధ పోటీ పరీక్షలు రాసినా ఉద్యోగం రాలేదు. తీవ్రమనస్తాపం చెంది ఈనెల 16 గడ్డిమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సుల్తానాబాద్, ఆ తర్వాత కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడి తండ్రి వెంకటేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.
సారంగాపూర్(జగిత్యాల): కారు ఢీకొని వ్యక్తి ద్విచక్రవాహనం పై నుంచి కింద పడగా, అదే సమయంలో అతడిపై నుంచి ట్రాలీ ఆటో వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందిన ఘటన బీర్‌పూర్ మండలం తుంగూర్ గ్రామ శివారులో శుక్రవారం జరిగింది. ఎస్సై రాజు కథనం ప్రకారం.. మండలంలోని నర్సింహులపల్లె గ్రామానికి చెందిన దూసమూడి రమేశ్ (46) ఇదే మండలంలోని రేకుపల్లి గ్రామానికి ద్విచక్రవాహనంపై వెళ్లి రాజేశ్ అనే బాలుడికి తీసుకుని ఇంటికి వస్తున్నాడు. జగిత్యాల పట్టణం విద్యానగర్‌కు చెందిన సముద్రాల తిరుపతి కారులో జగిత్యాలకు వెళ్తున్న క్రమంలో తుంగూర్ వద్ద రమేశ్ వాహనాన్ని ఢీకొట్టడంతో కింద పడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో ఆదిలాబాద్ జిల్లా నన్నూరుకు చెందిన తరుణ్ ట్రాలీ ఆటో రమేశ్ పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
మల్యాల(చొప్పదండి): మండలంలోని దిగువ కొండగట్టులో గుర్తుతెలియని మహిళ అనారోగ్యంతో మృతిచెందింది. ఎస్సై నరేశ్‌కుమార్ కథనం ప్రకారం..దిగువ కొండగట్టులోని జాతీయ రహదారి సమీపంలో సుమారు 55 ఏళ్ల వయసు గల మహిళ మృతిచెంది ఉంది. ముత్యంపేట కారోబార్ రాజేశ్వర్‌రావు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
ధర్మారం(ధర్మపురి): పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని ఆలయాల్లో చోరీల పరంపర కొనసాగుతూనే ఉంది. గురువారం రాత్రి గోపాల్‌రావుపేట గ్రామంలోని శ్రీమల్లికార్జున స్వామి ఆలయంలో హుండీ చోరీకి గురైంది. ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు .. హుండీని ఆలయం వెనుకాలకు తీసుకెళ్లి పగులగొట్టారు. అందులోని నగదు, కట్నకానుకలు ఎత్తుకపోయారని ఆలయ కమిటీ చైర్మన్ అంజయ్య తెలిపారు. కొద్దిరోజులుగా వరుసగా చోటుచేసుకుంటున్న హుండీ చోరీలను పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు. దొంగలను పట్టుకునేందుకు గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు. ఇదేసమయంలో మల్లికార్జున స్వామి ఆలయంలో దొంగతనం చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. ఈ ఆలయంతోపాటు మేడారంలోని హనుమాన్ ఆలచయ హుండీల్లో నగదు, కట్నకానుకలు తక్కువ మొత్తంలోనే ఉంటాయి. అయినా, దొంగలు చోరీలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
రూ.4.90 లక్షలకు టోకరా
కరీంనగర్‌క్రైం: టెలిగ్రాంలో వచ్చిన లింక్ క్లిక్‌చేసి అందులో పెట్టుబడి పెట్టిన వ్యక్తికి సైబర్ నేరగాళ్లు రూ.4.90 లక్షలకు టోకరా వేశారు. త్రీటౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. ఖాన్‌పురాకు చెందిన వ్యక్తి టెలిగ్రాంలో వచ్చిన లింక్‌ను క్లిక్ చేశాడు. అందులో సైబర్ నేరగాళ్లు సూచించిన ప్రకారం ముందుగా రూ.వెయ్యి నుంచి రూ.2వేలు, రూ.10వేలు ఇలా మొత్తంగా రూ.4.90లక్షలు పంపించాడు. తరువాత వారు స్పందించకపోవడంతో త్రీటౌన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య

కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య