
24 గంటల వ్యవధిలో చైన్‌స్నాచర్ అరెస్ట్
జగిత్యాలక్రైం: వృద్ధురాలి మెండలోంచి బంగారం దొంగిలించిన దొంగను 24 గంటల వ్యవధిలో పట్టుకున్నట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. శుక్రవారం జగిత్యాల రూరల్ పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. గురువారం మధ్యాహ్నం జగిత్యాల రూరల్ మండలం సంగంపల్లి గ్రామానికి చెందిన నేరెల్ల లచ్చవ్వ మెడలోంచి ఓ దొంగ తులంన్నర బంగారు కుత్తికట్టును లాక్కుని పారిపోయాడు. దీంతో వృద్ధురాలి కుమారుడు గంగన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాల ద్వారా గాలింపు చేపట్టారు. శుక్రవారం జగిత్యాల–ధర్మపురి రోడ్‌లోని పొలాస స్టేజీ వద్ద రూరల్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా నిందితుడు జగిత్యాల రూరల్ మండలం హబ్సీపూర్ గ్రామానికి చెందిన మన్నె గంగరాజంను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. నిందితుడిని పట్టుకోవడంలో కృషి చేసిన రూరల్ సీఐ సుధాకర్, ఎస్సై సదాకర్, ఏఎస్సై సత్తయ్య, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, రవీందర్, మోహన్, శ్రీనివాస్, గంగాధర్, సుమన్‌ను డీఎస్పీ అభినందించారు.