
ఉద్యోగుల నిరసన బాట
సీపీఎస్ రద్దు, ప్రభుత్వ హామీల అమలుకు డిమాండ్
విద్రోహ దినంగా సెప్టెంబర్ ఒకటి
నేడు నల్లబ్యాడ్జీలతో నిరసనలు, దీక్షలకు పిలుపు
చలో హైదరాబాద్‌కు సన్నద్ధం
ఉమ్మడి జిల్లాలో 14వేల మందికిపైగా సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు
కరీంనగర్: ఉద్యోగ భద్రత, మంచి జీతభత్యాలు, ఉద్యోగ విరమణ అనంతరం నెలానెలా పింఛన్ ఉంటుందని ప్రభుత్వ కొలువు కొట్టేందుకు పోటీ పడుతుంటారు. కానీ ప్రస్తుతం అమలవుతున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్) ప్రభుత్వ ఉద్యోగులను తీవ్రంగా కలచివేస్తోంది. ఉమ్మడిజిల్లాలో 14వేల మందికిపైగా సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉన్నారు. మూడు దశాబ్దాలకుపైగా ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన తర్వాత తమకు, తమ కుటుంబాలకు సామాజిక భద్రత లేకపోవడంతో ఉద్యమ బాటపడుతున్నారు. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(జాక్టో), యూఎస్పీసీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులకు వినతిపత్రాలు, నల్లబ్యాడ్జీలు ధరించి విధుల్లో పాల్గొనాలని, భోజన విరామ సమయంలో శాంతియుత ప్రదర్శనలకు పిలుపునిచ్చారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు చలో హైదరాబాద్‌కు సిద్ధం అవుతున్నాయి.
సీపీఎస్ పింఛన్ విధానం
కేంద్ర ప్రభుత్వం 2004 జనవరి 1 నుంచి, రాష్ట్ర ప్రభుత్వం అదే ఏడాది సెప్టెంబర్ నుంచి సీపీఎస్ విధానం అమలు చేస్తున్నాయి. ఈ పథకాన్ని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ ఆథారిటరీ(పీఎఫ్‌ఆర్‌డీఏ), నేషనల్ సెక్యూరిటీ డిపాజిట్ లిమిటెడ్(ఎన్‌ఎస్‌డీఎల్) సమన్వయంతో అమలు చేస్తున్నారు. మూల వేతనం, డీఏలతో 10శాతం మొత్తానికి ప్రభుత్వ వాటా, 10 శాతం ఉద్యోగి మ్యాచింగ్ గ్రాంటుగా చెల్లిస్తారు. జమ చేసిన మొత్తాన్ని ప్రైవేటు ఫండ్ మేనేజర్లకు అప్పగిస్తారు. వారు వివిధ ఫండ్‌లో, షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెడతారు. ఉద్యోగి పదవీ విరమణ సందర్భంగా అప్పటి మార్కెట్ విలువల ఆధారంగా ఖాతా నిల్వలోని 60శాతం మొత్తాన్ని నగదుగా చెల్లిస్తారు. మిగతా 40శాతం పింఛన్‌గా నిర్ణయిస్తారు. మార్కెట్ ఒడిదొడుకులకు అనుగుణంగా తగ్గడం లేదా పెరగవచ్చు.
పాత పింఛన్ విధానంతో లాభాలు
2004కు ముందు నియామకం అయిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛన్ విధానం అమలు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగి ఎలాంటి వాటా చెల్లించకుండానే పదవీ విరమణ సమయంలో తన చివరి మూలవేతనం(బేసిక్‌పే)లో 50శాతం పింఛన్‌గా నిర్దారించి, ఆ మిగతా 50శాతానికి అన్ని రకాల భత్యాలు(అలవెన్స్) కలుపుకొని చెల్లిస్తారు. ప్రభుత్వోద్యోగులకు కరువు భత్యం పెంచినప్పుడు పింఛనుదారులకు ఇది వర్తిస్తోంది. ప్రభుత్వాలు ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రకటించే వేతన సవరణ సంఘం(పీఆర్సీ) ద్వారా ఉద్యోగులతో పాటు అప్పటి ధరలకు అనుగుణంగా పింఛన్ మొత్తాన్ని పెంచుతారు.