జీపీవో పోస్టుకు పైరవీలు | - | Sakshi
Sakshi News home page

జీపీవో పోస్టుకు పైరవీలు

Sep 4 2025 6:05 AM | Updated on Sep 4 2025 6:05 AM

జీపీవ

జీపీవో పోస్టుకు పైరవీలు

● రాజకీయ నేతల చుట్టూ ప్రదక్షిణలు ● ‘మామూలు’గా పలువురి వ్యవహారం ● కౌన్సెలింగ్‌తో పోస్టింగ్‌ ఇస్తే సరి

జిల్లాలో రెవెన్యూ గ్రామాలు: 210,

క్లస్టర్లు: 142, ఉత్తీర్ణులు: 163

కరీంనగర్‌ అర్బన్‌: భూ భారతి చట్టం అమలులో కీలకంగా మారనున్న గ్రామ పాలన అధికారుల(జీపీవో) నియామకాలకు ముందే పైరవీలు జోరందుకున్నాయి. రేపో, మాపో ప్రభుత్వం జీపీవోల నియామకాలు చేపట్టనుందనే ప్రచారంతో ఓ కార్యాలయం వేదికగా ఒకరిద్దరు బేరసారాలకు తెరలేపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వం వీఆర్‌ఎ, వీఆర్వోల వ్యవస్థను రద్దుచేసి ఇతర శాఖల్లో సర్దుబాటు చేసిన వారిని మాతృశాఖకు తీసుకొచ్చేందుకు ప్రస్తుత ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. గత మే 27, జులై 27న పరీక్షలు నిర్వహించగా 163 మంది అర్హత సాధించారు. ఈ నెల మొదటివారంలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు పంపిణీ చేస్తారని రెవెన్యూ వర్గాల్లో ప్రచారం జరగడంతో పైరవీలకు కారణమవుతోంది. జిల్లాలో ప్రస్తుతం 210 రెవెన్యూ గ్రామాలు ఉండగా రెండు, మూడు రెవెన్యూ గ్రామాలు కలుపుకొని 142 క్లస్టర్లు ఉన్నాయి. జిల్లాలో జీపీవో పరీక్ష అర్హత సాధించిన వారు 163 మంది ఉండగా.. వారికే క్లస్టర్ల బాధ్యతలు అప్పజెప్పుతారనే మాట రెవెన్యూ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఫలితంగా ఆదాయం ఎక్కువ ఉండే క్లస్టర్లను దక్కించుకోవాలని కొందరు కీలక విభాగ ఉద్యోగులను సంప్రదించడంతో.. ఇదే అదనుగా సంబంధీకులు జీపీవో అభ్యర్థులకు నేరుగా ఫోన్లు చేయడం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పుడు కొందరు సొంత మండలాల్లో పని చేస్తుండగా.. మరికొందరు కుటుంబాలకు దూరంగా ఉంటూ ఆయా శాఖల్లో విధులు నిర్వహిస్తున్నారు. దగ్గరగా ఉన్న క్లస్టర్లను కేటాయించాలని కొందరు.. సొంత మండలం నుంచి దూర ప్రదేశాలకు తరలించవద్దని మరికొందరు పైరవీలు చేస్తూ అధికారులపై ఒత్తిళ్లు తెచ్చేందుకు ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారనే చర్చ జరుగుతోంది. అభ్యర్థుల విద్యార్హత, సమర్థత ఆధారంగా కౌన్సెలింగ్‌ నిర్వహించి పోస్టింగ్లు కేటాయించాలని.. మెజార్టీ అభ్యర్థులు కోరుతున్నారు. మరి కలెక్టర్‌ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది.

పాతవా.. కొత్తవా

జిల్లాలో ఇప్పటికే 142 క్లస్టర్లుగా గుర్తించగా మరిన్ని పెంచే అవసరముందని ఇటీవల ప్రభుత్వం ప్రతిపాదనలు కోరింది. ఈ క్రమంలో 255కు పెంచాలని జిల్లా అధికారులు నివేదించినట్లు సమాచా రం. పాత క్లస్టర్ల ప్రకారమైతే ఉత్తీర్ణులైనవారు ఎక్కువగా ఉండగా కొందరు మిగలనున్నారు. కరీంనగర్‌ అర్బన్‌లో 3 క్లస్టర్లుండగా మరో 6 క్లస్టర్లు పెంచాలని ప్రణాళిక రూపొందించగా కొత్తపల్లి మండలంలో 9 ఉండగా మరో 7, కరీంనగర్‌ రూరల్‌లో 9 ఉండగా మరో 9, రామడుగులో 10 ఉండగా మరో 8, మానకొండూరులో 13 ఉండగా మరో 7, తిమ్మాపూర్‌లో 10 ఉండగా మరో 7, చిగురుమామిడిలో 8 ఉండగా మరో 7, చొప్పదండిలో 8 ఉండగా మరో 7, గంగాధరలో 11 ఉండగా మరో 8, గన్నేరువరంలో 6 ఉండగా మరో 4, హుజూరాబాద్‌లో 10 ఉండగా మరో 10, జమ్మికుంటలో 9 ఉండగా మరో 11, శంకరపట్నంలో 10 ఉండగా మరో 6, వీణవంకలో 10 ఉండగా మరో 7, సైదాపూర్‌లో 9 ఉండగా మరో 6, ఇల్లందకుంటలో 7 ఉండగా మరో 3 క్లస్టర్లు పెంచాలని ప్రభుత్వానికి నివేదించారు. అయితే పాత క్లస్టర్ల ప్రకారం నియామకాలుంటాయా.. నివేదికల క్రమంలో క్లస్టర్లను పెంచి నియామకాలు చేపడుతారా అన్నది త్వరలోనే తేలనుంది.

జీపీవో పోస్టుకు పైరవీలు1
1/2

జీపీవో పోస్టుకు పైరవీలు

జీపీవో పోస్టుకు పైరవీలు2
2/2

జీపీవో పోస్టుకు పైరవీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement