
కాళేశ్వరం అవసరం లేకుండానే సాగునీరు
తిమ్మాపూర్: కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోయకుండానే రెండేళ్లుగా పంటలకు సాగునీరు అందిస్తున్నామని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. దిగువమానేరు జలాశయం నుంచి కాకతీయ కాలువకు బుధవారం ఉదయం నీటి ని విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ప్రకృతి సహకారంతో వర్షాలు కురుస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 24.034 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 22.534 టీఎంసీలకు చేరిందని తెలిపారు. ఎస్‌ఈ రమేశ్ పాల్గొన్నారు.
అర్హత ఉంటేనే చేయూత
కరీంనగర్ అర్బన్: అర్హత ఉంటేనే చేయూత పింఛన్లు మంజూరు చేయాలని సెర్ప్ సామాజిక భద్రత డైరెక్టర్ గోపాల్‌రావు అన్నారు. నగరంలోని కళాభారతిలో బుధవారం 11 రకాల చేయూత పింఛన్లు, జాతీయ కుటుంబ ప్రయోజన పథకం(ఎన్‌ఎఫ్‌బీఎస్)పై ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ సెక్రటరీలు, బిల్ కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వివిధ సమస్యలతో నిలిచిపోయిన పింఛన్లపై విచారణ జరిపి మండలస్థాయిలో గ్రీవెన్స్, వెరిఫికేషన్ రిపోర్ట్‌తో రోల్ బ్యాక్ చేసుకోవాలని, ఫేషియల్ రికగ్నిషన్ మొబైల్ యాప్ ద్వారా, పంచాయతీ సెక్రటరీ అథెంటిఫికేషన్‌పై డీవోపీ పోస్టల్ ద్వారా పింఛన్ల పంపిణీపై అవగాహన కల్పించారు. డీఆర్డీవో వి.శ్రీధర్ పాల్గొన్నారు.
పవర్‌కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: విద్యుత్ లైన్లను సరిదిద్దే పనులు చేపడుతున్నందున గురువారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 11 కేవీ గీతా భవన్, రాంనగర్ ఫీడర్ల పరిధిలోని జయరాం హాస్పిటల్, రాజీవ్‌పార్కు, రాంనగర్, మంకమ్మతోట, మార్క్‌ఫెడ్, లేబర్ అడ్డ, పారమిత పాఠశాల పద్మనగర్, ప్రగతినగర్, పద్మనగర్, రాంనగర్ ఫిష్‌మార్కెట్, సత్యనారాయణ స్వామి ఆలయం, లిటిల్ పార్కు, వాసర హాస్పిటల్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్– 2 ఏడీఈ ఎం.లావణ్య తెలి పారు. వినాయకుల నిమజ్జనం సందర్భంగా విద్యుత్ లైన్లను సరిచేసే పనులు కొనసాగుతున్నందున ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 33/11 కె.వీ.కొత్తపల్లి సబ్‌స్టేషన్ పరిధిలోని కొత్తపలి, తూర్పువాడ ప్రాంతాలు, ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 గంటల వరకు 33/11 కె.వీ.పద్మనగర్, శాతవాహన సబ్‌స్టేషన్‌ల పరిధిలోని చింతకుంటలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు రూరల్ ఏడీఈ గాదం రఘు పేర్కొన్నారు.
ఎల్‌ఎండీ నుంచి లీగల్ మెట్రాలజీ విధులు
కరీంనగర్ అర్బన్: జిల్లా తూనికలు, కొలతలశాఖ అధికారులు ఇక ఎల్‌ఎండీ నుంచే విధులు నిర్వహించనున్నారు. ఇన్నాళ్లపాటు నగరంలోని భగత్‌నగర్‌లో అద్దె భవనంలో కార్యాలయం కొనసాగించగా తాజాగా ప్రభుత్వ భవనానికి మార్చారు. ఎల్‌ఎండీ కాలనీలోని కొత్త ప్రభుత్వ భవనంలోకి షిఫ్ట్ చేశారు. ఏసీ లీగల్ మెట్రాలజీ కార్యాలయం, జిల్లా లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ కార్యాలయం, లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్ కార్యాలయాలను ఇప్పటికే తరలించగా గురువారం నుంచి ఎల్‌ఎండీ కొత్త భవనంలోనే విధులు నిర్వహించనున్నారని కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి.

కాళేశ్వరం అవసరం లేకుండానే సాగునీరు