
బీదర్ టు కరీంనగర్
కరీంనగర్‌క్రైం: బీదర్ నుంచి గోదావరిఖని మీదుగా కరీంనగర్‌కు పెద్దఎత్తున గుట్కా తరలిస్తున్న రెండు వాహనాలను కరీంనగర్ వన్‌టౌన్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు నగరంలోని తీగల వంతెన సమీపంలో బుధవారం వేకువజామున పట్టుకున్నారు. రూ.1.14 కోట్ల విలువైన 7,60,000 గుట్కా ప్యాకెట్లు, ఒకరి వద్ద రూ.13,17,850 నగదు, 11 సెల్‌ఫోన్లు సీజ్ చేశారు. గుట్కా రవాణాలో గోదావరిఖనికి చెందిన నలుగురు, కరీంనగర్‌కు చెందిన ఏడుగురు ఉన్నారు. వీరిలో ప్రకాశం గంజ్‌కు చెందిన వ్యాపారులు నలుగురు ఉన్నట్లు సమాచారం. వీరిపై కేసు నమోదు చేసి, 11మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. గుట్కా దందాలో ప్రకాశం గంజ్‌తోనే పెద్దఎత్తున్న సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ప్రకాశం గంజ్‌లోనే మూలాలు...
గుట్కా దందాలో నగరంలోని ప్రకాశం గంజ్‌తోనే పెద్దఎత్తున్న సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. ఇక్కడ ఉన్న కొందరు వ్యాపారులు అడ్డదారిలో సంపాదనే ధ్యేయంగా దందాను ప్రారంభించారని సమాచారం. ఒక ప్యాకెట్‌కు సుమారుగా రూ.10 నుంచి రూ.15 వరకు విక్రయిస్తుండగా.. పోలీసులు పట్టుకున్న సరుకు విలువ బ్లాక్‌మార్కెట్‌లో రూ.కోట్లలో ఉండనుంది. ఈ దందా వెనక బడాబాబులు ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం.
● రూ.1.14 కోట్ల విలువైన గుట్కా రవాణా
● బుధవారం వేకువజామున పట్టివేత
● 13 మందిపై కేసు, 11 మంది అరెస్టు