
సూక్ష్మ కళ.. భళా
పెద్దపల్లిరూరల్: బియ్యంలోని రాళ్లను ఏరడం.. సూదిలో దారం దూర్చడమే కష్టమనుకునే ప్రస్తుత తరుణంలో ఏకంగా బియ్యపుగింజతో శివలింగం తయారు చేయడమే కాకుండా.. మరో బియ్యపుగింజలోకి ఆ శివలింగం దూర్చి అబ్బురపరుస్తున్నాడు పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ గ్రామానికి చెందిన ఏళేశ్వరం సత్యబాపుచారి. కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమని తనలోని సూక్ష్మకళా నైపుణ్య ప్రదర్శించి అబ్బురపరుస్తున్నాడు.
బియ్యపుగింజతో శివలింగం
బియ్యపుగింజపై అక్షరాలు రాయడం, చాక్‌పీస్, సబ్బుబిళ్లపై బొమ్మలు గీసే కళాకారులను ఆదర్శంగా తీసుకుని ఏదోఒకటి వినూత్నంగా తయారు చేయాలనుకున్నాడు స్వర్ణకార వృత్తి చేసే సత్యబాపుచారి. ఆలోచన వచ్చిందే తడవుగా తన మేధాశక్తిని ఉపయోగించి బియ్యపుగింజపై శివలింగం రూపొందించాడు. మరో బియ్యపుగింజకు రంధ్రం చేసి ఈ శివలింగాన్ని అందులోంచి దూర్చి ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా బియ్యంతో తయారుచేసిన శివలింగాన్ని ఆవగింజపై నిలబెట్టడం తన సూక్ష్మకళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచింది.
దారంపోగులు దూర్చి..
బియ్యపుగింజకు రంధ్రంచేసి అందులోంచి ఏకంగా 150 దాకా దారం పోగులను దూర్చి ఔరా అని అబ్బురపరుస్తున్నాడు సత్యబాపుచారి. తన సూక్ష్మ కళానైపుణ్యంతో 9 రకాల సూక్ష్మకళారూపాలు ప్రదర్శించడంతో తెలంగాణ సంస్కృతి సాహితీ బుక్ ఆఫ్ రికార్డు ఇటీవల వరంగల్‌లో మహానంది జాతీయ పురస్కారంతోపాటు ప్రశంసాపత్రా అందించి సత్కరించారు.
బియ్యపు గింజతో శివలింగం
స్వర్ణకారుడి నైపుణ్యం
అబ్బురపరుస్తున్న కళాకారుడు

సూక్ష్మ కళ.. భళా

సూక్ష్మ కళ.. భళా