
అంజన్న తలనీలాల టెండర్ వాయిదా
● టెండర్‌లో కొత్తవారికి అవకాశం
● ఆలయ అభివృద్ధికి అధికారుల నిర్ణయం
● త్వరలోనే టెండర్ ప్రకటన జారీ
మల్యాల: కొండగట్టు ఆంజన్నకు భక్తులు సమర్పించే తలనీలాల సేకరణ టెండర్‌లో కాంట్రాక్టర్లు కుమ్మకై ్క ఆలయ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఆలయ నిబంధలను సాకుగా చూపి.. కొత్తవారికి టెండర్‌లో పాల్గొనే అవకాశం లేకుండా చేసి.. ఉన్నవారు ఎంతంటే అంత అన్నచందంగా మార్చారు. దీనిపై ‘తలనీలాల టెండ‘రింగ్’ శీర్షికన ‘సాక్షి’ ఈనెల 22న కథనం ప్రచురించింది. దీనిపై అధికారులు స్పందించారు. తలనీలాల టెండర్‌లో కొత్తవారు పాల్గొనేలా అవకాశం కల్పించారు. ఈ మేరకు ఈ నెల 24న నిర్వహించాల్సిన తలనీలాల టెండర్‌ను వాయిదా వేస్తూ ఆలయ ఈఓ శ్రీకాంత్‌రావు ప్రకటన విడుదల చేశారు. టెండర్ ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.
కొండగట్టు అంజన్న ఆలయానికి భక్తులు సమర్పించిన తలనీలాల (ఏడు నెలలు పోగు చేసిన)ను సేకరించేందుకు ఈనెల 18న టెండర్ నిర్వహించారు. ఇందులో 13మంది టెండర్‌దారులు పాల్గొన్నారు. సీల్డ్ కవర్ల అంశంపై పలువురు అభ్యంతరం తెలపడంతో అధికారులు ఈనెల 24కు వాయిదా వేశారు. దేవాదాయ శాఖ నిబంధనల మేరకు వాయిదా వేసిన టెండర్‌లో కేవలం 13మంది మాత్రమే పాల్గొనవచ్చని, కొత్త వ్యక్తులు పాల్గొనే అవకాశం లేదంటూ అధికారులు నిరాకరించారు. టెండర్‌దారులు కమ్ముకై ్క ఆలయ ఆదాయానికి గండి కొట్టే ప్రయత్నం చేశారు. గతేడాది కూడా తలనీలాలను కిలో రూ.8500కే దక్కించుకున్నారు. ఈ ఏడాది కొద్దిపాటి మార్పుతో టెండర్ దక్కించుకునేందుకు కొంతమంది బినామీలతో కలిసి టెండర్‌లో పాల్గొన్నారు. అదే యాదాద్రిలో మాత్రం తలనీలాలకు కిలో రూ.20వేలు పలుకుతోంది. యాదాద్రిలో నిర్వహించిన టెండర్‌లో పాల్గొన్న వారే కొండగట్టులోనూ పాల్గొని బినామీలతో టెండర్‌ను దక్కించుకునే ప్రయత్నం చేశారు. ఈ లెక్కన ఆలయానికి సుమారు రూ.50లక్షలకు పైగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో ‘సాక్షి’ కథనానికి స్పందించిన అధికారులు తలనీలాల టెండర్‌లో కొత్తవారికి అవకాశం కల్పించేలా చేశారు.

అంజన్న తలనీలాల టెండర్ వాయిదా