
ప్రాణం తీసిన అతివేగం.. నిద్రమత్తు
తిమ్మాపూర్: అతివేగం.. నిద్రమత్తు ఒకరి ప్రాణం తీసింది. ఆగిఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన తిమ్మాపూర్ మండలం రేణికుంటలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. ఎల్‌ఎండీ ఎస్సై శ్రీకాంత్ వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని టంగుటూర్ మండలం మణికొండ గ్రామానికి చెందిన సర్వేశ్వరావు హైదరాబాద్‌లోని కాలికాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. ఆయన పెద్ద కొడుకు మన్నె రాఘవ(22), లంగరు లోకేశ్, స్నేహ స్నేహితులు. స్నేహకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో గంగాధరలో నాటు వైద్యం చేయించడానికి ఆమె తల్లిదండ్రులు రాజేశ్, లక్ష్మీతో కలిసి సెల్ఫ్ డ్రైవింగ్ కారు అద్దెకు తీసుకుని బుధవారం బయల్దేరారు. ఉదయం 10గంటలకు తిమ్మాపూర్ మండలం రేణికుంట శివారులోని టోల్‌గేట్ సమీపంలో రోడ్డుపక్కన ఆగి ఉన్న లారీని వీరి కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. రాఘవ, కారు నడుపుతున్న లోకేశ్, స్నేహ, రాజేష్, లక్ష్మీకి గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మన్నె రాఘవ మరణించాడు. రాఘవ తండ్రి ఫిర్యాదు మేరకు లోకేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.
ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు
ఒకరి మృతి.. నలుగురికి గాయాలు