పోక్సో కేసులో 20 ఏళ్ల జైలు | - | Sakshi
Sakshi News home page

పోక్సో కేసులో 20 ఏళ్ల జైలు

Jul 23 2025 5:46 AM | Updated on Jul 23 2025 5:46 AM

పోక్స

పోక్సో కేసులో 20 ఏళ్ల జైలు

బాధితురాలికి రూ.2 లక్షల పరిహారం

జగిత్యాలజోన్‌: బాలికను ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి శారీరకంగా లోబర్చుకున్న కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్షతోపాటు రూ.2వేల జరిమానా విధిస్తూ జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి. రత్నపద్మావతి మంగళవారం తీర్పు చెప్పారు. బాధితురాలికి ప్రభుత్వం తరఫున రూ.2 లక్షల పరిహారం అందించాలని సూచించారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రామకృష్ణారావు కథనం ప్రకారం.. జిల్లాలోని ఓ మండల కేంద్రానికి చెందిన బాలిక తండ్రి చనిపోవడం.. తల్లి ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లడంతో తమ్ముడితో కలిసి అమ్మమ్మ వద్ద ఉంటోంది. సమీపంలోని పట్టణానికి వెళ్లి ఇంటర్‌ చదువుతోంది. జగిత్యాల రూరల్‌ మండలం పోరండ్ల గ్రామానికి చెందిన మర్రిపెల్లి సాయినాథ్‌తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. 1 మార్చి 2021న కళాశాలకు వెళ్తున్నానని చెప్పింది. సాయినాథ్‌తో కలిసి వెళ్లాలనుకుంది. అయితే సాయినాథ్‌ ఫోన్‌ పనిచేయకపోవడంతో అర్ధరాత్రి వరకు కరీంనగర్‌ బస్టాండ్‌లోనే ఉంది. కరీంనగర్‌కు చెందిన ఓ యువతి జరిగిన విషయం తెలుసుకుని, బాలికను చేరదీసి, తన ఇంటి వద్ద ఉంచుకుంది. కొన్ని రోజులు కరీంనగర్‌లోనే ఉన్న బాలిక జగిత్యాలకు చేరగా సాయినాథ్‌ కనిపించాడు. దీంతో సాయినాథ్‌ సదరు బాలికను హబ్సీపూర్‌ తీసుకెళ్లాడు. అనంతరం బాలిక తన స్నేహితుడి ద్వారా అమ్మమ్మ ఇంటికి వెళ్లి ఆధార్‌కార్డుతోపాటు తన బంగారు చెవి కమ్మలు ఎవ్వరికి తెలియకుండా తెచ్చుకుంది. జగిత్యాలలోని ఓ ఫైనాన్స్‌ సంస్థలో చెవి కమ్మలు తాకట్టుపెట్టి వచ్చిన సొమ్ముతో సెల్‌ఫోన్‌ కొనుగోలు చేసి.. ప్రతిరోజు సాయినాథ్‌తో మాట్లాడుతుండేది. తన మనుమరాలు కనబడటం లేదని 27 మార్చి 2021న పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విషయం తెలుసుకున్న బాలిక అమ్మమ్మ ఇంటికి వచ్చింది. సాయినాథ్‌ వల్ల తనకు అన్యాయం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అప్పటి ఎస్సై జి.రవీందర్‌ పోక్సో కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ ఎల్‌.శ్రీను కేసు దర్యాప్తు చేసి మరిపెల్లి సాయినాథ్‌ను అరెస్ట్‌ చేసి, కోర్టులో చార్జీషీట్‌ దాఖలు చేశారు. కోర్టు మానిటరింగ్‌ అధికారులు కిరణ్‌కుమార్‌, బి.రాజు, డి.శ్రీధర్‌, టి.రజనీకాంత్‌ సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టడంతో పరిశీలించిన జడ్జి సాయినాథ్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు.

పేలుడు పదార్థాలు పట్టివేత

ముస్తాబాద్‌(సిరిసిల్ల): ముస్తాబాద్‌ మండలంలో గుట్టుగా సాగుతున్న పేలుడు పదార్థాల వినియోగాన్ని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రట్టు చేశారు. ముస్తాబాద్‌ మండలం నామాపూర్‌లో పేలుడు పదార్థాల అక్రమ రవాణాను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సోమవారం రాత్రి ఛేదించారు. టాస్క్‌ఫోర్స్‌ సీఐ నటేశ్‌, ఎస్సై గణేశ్‌ వివరాల ప్రకారం.. నిజామాబాద్‌ జిల్లా నందిపేట గ్రామానికి చెందిన గడిపర్తి శ్రీనివాస్‌రావు(56) తన యజమాని ఓర్సు సాయిమల్లు ఆదేశాలతో సోమవారం రాత్రి టాటా వాహనంలో ఎలాంటి అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలను నామాపూర్‌లోని శివరాత్రి రాజుకు విక్రయిస్తుండగా, పక్కా సమాచారం మేరకు సీఐ నటేశ్‌ దాడులు చేశారు. వారి నుంచి 2,600 జిలెటిన్‌ స్టిక్స్‌, ఐడియల్‌ బూస్టర్‌ జిలెటిన్స్‌ 405, ఆరువేల మీటర్ల కార్డెక్స్‌ వైర్‌, 175 డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్‌రావు, శివరాత్రి రాజు, ఓర్సు సాయిమల్లుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై గణేశ్‌ తెలిపారు.

సంపులో పడి వృద్ధురాలు మృతి

తంగళ్లపల్లి: ప్రమాదవశాత్తు నీటిసంపులో పడి వృద్ధురాలు మృతి చెందిన ఘటన మండలంలోని బస్వాపూర్‌లో మంగళవారం జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని బస్వాపూర్‌లో చెన్నం బాపురెడ్డి– బాలవ్వ(82) దంపతులు నివాసం ఉంటున్నారు. బాలవ్వ మంగళవారం వేకువజామున నిద్రలేచి వాకిలి ఊడ్చి, అలుకు చల్లేందుకు ఇంటి ఎదుట ఉన్న సంపులో నీటిని తోడే ప్రయత్నం చేయగా.. ప్రమాదవశాత్తు సంపులో పడింది. అప్పుడే భయటకు వచ్చిన బాపురెడ్డి చూసి కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి బాలవ్వను సంపులో నుంచి బయటకు తీయగా అప్పటికే మృతి చెందింది. బాపురెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో తంగళ్లపల్లి ఎస్సై ఉపేంద్రచారి కేసు నమోదు చేశారు.

గాయపడిన యువకుడి మృతి

విషాదంలోనూ కళ్లు దానం చేసిన కుటుంబసభ్యులు

జ్యోతినగర్‌(రామగుండం): ఎన్టీ పీసీ లేబర్‌ గేట్‌ సమీపంలోని రాజీవ్‌ రహదారిపై సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బోయిని యశ్వంత్‌(19) కరీంనగర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. ఏఎస్సై తిరుపతి కథనం ప్రకారం .. ఎన్టీపీసీ సుభాష్‌నగర్‌లో నివసిస్తున్న బోయిని లక్ష్మీ కుమారుడు యశ్వంత్‌ రాత్రి భోజనం చేశాక సమీపంలోని రాజీవ్‌ రహదారిపైకి నడుస్తూ వెళ్లాడు. ఈ క్రమంలో మహారాష్ట్రకు చెందిన లారీ గోదావరిఖని నుంచి పెద్దపల్లి వైపు వేగంగా వెళ్తూ యువకుడిని ఢీకొట్టింది. తీవ్రగాయాలైన యశ్వంత్‌ను గోదావరిఖనికి ఆ తర్వాత కరీంనగర్‌ తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్‌ స్వప్నిల్‌ గణపతిపై కేసు నమోదు చేశారు. కాగా, ఎన్టీపీసీ సోలార్‌ ప్లాంట్‌లో కార్మికుడిగా పనిచేసే యశ్వంత్‌ మృతితో సుభాష్‌నగర్‌కాలనీలో విషాదం అలముకుంది. మృతుడి తండ్రి ప్రభాకర్‌ పదేళ్లక్రితమే మృతి చెందాడు. తల్లి కూలీపనులు చేస్తూ ఇద్దరు కొడుకులు, ఒక కూతురును పోషిస్తోంది. చిన్న కుమారుడు యశ్వంత్‌ మృతితో ఆమె రోదిస్తున్న తీరు కంటతడిపెట్టించింది. సదాశయ ఫౌండేషన్‌ ప్రతినిధుల అభ్యర్థన మేరకు తీవ్ర విషాదంలోనూ యశ్వంత కళ్లను కుటుంబ సభ్యులు దానం చేశారు. ఎల్వీ ప్రసాద్‌ ఐ బ్యాంక్‌ టెక్నీషియన్‌ ప్రదీప్‌ నాయక్‌ ఆధ్వర్యంలో అవగాహన కల్పించగా, తల్లి లక్ష్మి, సోదరి వర్ణిక, సోదరుడు వేణు అంగీకరించారు. ఫౌండేషన్‌ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్‌ కుమార్‌, ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, గౌరవ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, ముఖ్య సలహాదారు రమేశ్‌, కార్యదర్శి భీష్మాచారి, ప్రచార కార్యదర్శి కేఎస్‌ వాసు, లయన్స్‌ క్లబ్‌ మాజీ అధ్యక్షుడు పి.మల్లికార్జున్‌, అధ్యక్షుడు ఎల్లప్ప, కార్యదర్శి సారయ్య, కోశాధికారి రాజేందర్‌ కుటుంబ సభ్యులను అభినందించారు.

పోక్సో కేసులో 20 ఏళ్ల జైలు
1
1/1

పోక్సో కేసులో 20 ఏళ్ల జైలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement