
స్థానికం తర్వాతే..
● ఉద్యోగుల స్థానచలనం కోసం వివరాల సేకరణ ● రెండేళ్లు దాటినవారికి బదిలీ
జిల్లాలో మొత్తం శాఖలు, విభాగాలు: 65
గెజిటెడ్ అధికారులు: 1,155
నాన్‌గెజిటెడ్ అధికారులు: 6,295
నాలుగో తగరతి ఉద్యోగులు: 1,157
మొత్తం ఉద్యోగులు: 8,607
కరీంనగర్ అర్బన్: ఉద్యోగుల బదిలీలకు బ్రేక్ పడింది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించగా సాధారణ బదిలీలకు స్వల్ప విరామమేర్పడింది. బదిలీలు జరిగితే ఎన్నికల క్రమంలో ఇబ్బందులు తలెత్తే అవకాశముందని ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న అధికారులు, ఉద్యోగుల వివరాలు సేకరించిన యంత్రాంగం ప్రభుత్వ ఆదేశాల కోసం వేచిచూస్తోంది. తాజాగా ఎన్నికల అంఽశం తెరపైకి రావడంతో స్థానచలన ప్రక్రియ అక్టోబర్‌కు వాయిదా పడిందని విశ్వసనీయ సమాచారం.
ఇక ఏటా సాధారణ బదిలీలు
రెండేళ్ల సర్వీసు పూర్తయితే చాలు స్థానచలనం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తదనుగుణ ఆదేశాలు జారీకాగా జిల్లా యంత్రాంగం వివరాలు సేకరించింది. ఏటా సాధారణ బదిలీలు ఉండనుండగా ఒకే చోట దీర్ఘకాలంగా పనిచేయాలంటే కుదరదిక. పలువురు ఒకేచోట పాతుకుపోవడంతో ఉద్యోగ సంఘాల్లో పదవులుపొంది వాటి సాకుతో బదిలీలకు బ్రేక్ వేసుకుంటున్నారు. మరికొందరు తమకున్న రాజకీయ అనుబంధంతో టేబుళ్లు మారడమే పనిగా మార్చుకున్నారు. ఈ నేపథ్యంలో పరిపాలనపరంగా సత్వర సేవలతో పాటు అందరికి అన్ని పనులు రావాలనే ఉద్దేశంతో ఏటా సాధారణ బదిలీలు చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు ఆయా శాఖలవారీగా ఉద్యోగుల వివరాలను సేకరించిన యంత్రాంగం సదరు శాఖల ఉన్నతాధికారులకు నివేదించారు. 2018లో సాధారణ బదిలీలు జరగగా మళ్లీ 2024లో హెచ్చుశాఖల్లో బదిలీలు చేపట్టారు. అయితే ఏటా రెండేళ్లు పూర్తి చేసుకునేవారుండనుండగా వారందరికి స్థానచలనమే. శాఖల వారిగా ఖాళీలు, సీనియారిటీ జాబితాతో పాటు తప్పనిసరి బదిలీ అయ్యే అధికారులు, ఉద్యోగుల జాబితాను రూపొందించారు. అటెండర్ల నుంచి జిల్లాస్థాయి అధికారుల వరకు స్థానచలనం తప్పనిసరి.
మొదలైన పైరవీలు
బదిలీలకు తాత్కాలిక బ్రేక్ పడినప్పటికి పట్టణాలు, కలెక్టరేట్‌ను వీడని అధికారులు, ఉద్యోగులు అప్పుడే పైరవీలు ప్రారంభించారు. తమకున్న పలుకుబడి, రాజకీయ నేపథ్యాలతో పాటు మంత్రులను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. తమకు అనుకూలమైన ప్రాంతానికి పోస్టింగ్ కల్పించేలా ప్రయత్నాలు ప్రారంభించారు. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో పాటు రాజకీయ నేతలు, ప్రముఖ ప్రజాప్రతినిధులు ఇలా ఎవరికి వారుగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కీలకమైన స్థానాల్లోనే ఉండేలా కసరత్తు చేస్తున్నారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఏఈలు, ఏవోలు, ఏపీవోలతో పాటు ఇరిగేషన్, డీఆర్డీవో తదితర శాఖల అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
కేడర్ వారీగా బదిలీల బాధ్యతలు
బదిలీలను రాష్ట్రస్థాయి, మల్టిజోన్, జోనల్, జిల్లా కేడర్‌గా విభజించారు. ఆయా స్థాయిల్లో కమిటీలను ఏర్పాటుచేసి బదిలీ ఉత్తర్వులను జారీచేయనున్నారు. రాష్ట్రస్థాయిలో పోస్టులకు శాఖకు సంబంధించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి, కార్యదర్శి చైర్మన్‌గా వ్యవహరించనుండగా హెచ్‌వోడీ కన్వీనర్‌గా, అదనపు, సంయుక్త, ఉప కార్యదర్శులు సభ్యులుగా ఉండనున్నారు. అలాగే మల్టిజోనల్, జోనల్ స్థాయి పోస్టుల బదిలీలకు హెచ్‌వోడీ ఛైర్మన్‌గా కార్యదర్శి సూచించినవారు సభ్యులుగా, హెచ్‌వోడీ సూచించినవారు కన్వీసర్‌గా వ్యవహరించనుండగా జిల్లా కేడర్ పోస్టులకు కలెక్టర్ చైర్మన్‌గా అదనపు కలెక్టర్, డీఆర్వో సభ్యులుగా ఉండనుండగా శాఖకు సంబంధించిన జిల్లా అధికారి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.