
పాఠ్యాంశాల్లో మన కవులు
● వాచకాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కవులు
● తెలంగాణ పాఠ్యపుస్తకాల్లో మట్టి పరిమళాలు
సిరిసిల్ల: తెలంగాణ ప్రభుత్వం వెలువరించిన పాఠ్యాంశాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కవులకు ప్రముఖస్థానం లభించింది. తెలంగాణ ప్రభుత్వం జాబిలి, నవవసంతం, సింగిడి పేర్లతో తెలుగు వాచకాలను ముద్రించింది. రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలు చదువుకుంటున్న పాఠ్యాంశాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కవులు, రచయితలు రాసిన పాఠాలను బోధిస్తున్నారు. జిల్లా కవుల సాహిత్య సృజనకు సముచిత స్థానం దక్కింది. అలాంటి బాల్యంపై ముద్రవేసే పాఠ్యపుస్తకాలల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కవుల ఖ్యాతి ఎల్లలు దాటడం గమనార్హం. భారత మాజీ ప్రధాని బహుభాషావేత్త పీవీ నర్సింహారావుపై తొమ్మిదో తరగతి తెలుగు ఉపవాచకంలో పాఠ్యాంశంగా చేర్చారు. జ్ఞానపీఠమైన మన సాహిత్య శిఖరం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం హన్మాజిపేటకు చెందిన సి.నారాయణరెడ్డి రచనలు పదోతరగతి సింగిడిలో వచ్చింది. సిరిసిల్ల మండలం చిన్నబోనాలకు చెందిన కెప్టెన్ విజయరఘునందన్‌రావు గురించి 7వ తరగతి తెలుగు వాచకంలో చదవండి.. తెలుసుకోండి శీర్షికన పాఠాన్ని ప్రభుత్వం ముద్రించింది.
● ఆచ్చి వేంకటచార్యులు: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం అవునూర్‌కు చెందిన ఆచ్చి వేంకటాచార్యులు రాసిన పల్లె అందాలు ఏడో తరగతి తెలుగు వాచకంలో ఐదో పాఠంగా అచ్చయింది. వేంకటచార్యులు రాసిన ‘మాఊరు’ లఘుకావ్యంలోనిది. ఆండాళ్ బుర్రకథ, రాగమాల ఆయన రచనలు.
● డాక్టర్ సి.నారాయణరెడ్డి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం హన్మాజిపేటకు చెందిన డాక్టర్ సి.నారాయణరెడ్డి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. మూడో తరగతి జాబిలి నుంచి పదో తరగతి సింగిడి వరకు సి.నారా యణరెడ్డి రాసిన రచనలు జీవనభాష్యం (గజల్) చేర్చారు. తోటతల్లి గేయాన్ని మూడో తరగతిలో ముద్రించారు. బహుభాషావేత్తగా, సినీగేయ రచయితగా, పద్మవిభూషణ్ గ్రహీతగా సినారె కలానికి, గళానికి ప్రత్యేకత ఉంది.
● అందె వెంకట్రాజం: జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన అందె వెంకట్రాజం తొమ్మిదో తరగతి తెలుగు వాచకంలో ‘శతక మధురిమ’గా ముద్రించారు. నవోదయం, మణిమంజూష, కళతపస్విని పద్యకావ్యాలు రాశారు. అవధాన చతురానన బిరుదు పొందారు.
● గూడూరి సీతారాం: సిరిసిల్లకు చెందిన గూడూరి సీతారాం పదో తరగతి తెలుగు వాచకంలో భూమిక పాఠాన్ని పొందుపర్చారు. ఆయన మారాజు, లచ్చి, పిచ్చోడు, రాజమ్మ రాజీర్కం, నారయ్య బతుకు వంటి రచనలు చేశారు. 1953 లో తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శిగా పని చేసిన సీతారాం తొలితరం తెలంగాణ రచయితగా గుర్తింపు పొందారు.
● టి.కృష్ణమూర్తి యాదవ్: కరీంనగర్ జిల్లాకు చెందిన టి.కృష్ణమూర్తి యాదవ్ ఏడో తరగతి తెలుగు వాచకంలో నాలుగోపాఠం ‘అమ్మ జ్ఞాపకాలు’ పాఠాన్ని ముద్రించారు. ఇది శబ్ద కవితా సంపుటిలోనిది. సామాన్యుడి ఉచ్ఛ్వాస, నిశ్వాసాలను అక్షరాల్లో పొదిగి సామాన్య ప్రజల భాషలో కవిత్వం రచించిన సామాజిక కవి. ఆయన తొలి కవితాసంపుటి ‘తొక్కుడుబండ’.