
షరా మామూలే!
● నగరంలో ఫుట్‌పాత్, రోడ్ల ఆక్రమణల తొలగింపు ● కొద్దిరోజులకే మళ్లీ పాత స్థానాలకు వ్యాపారాలు
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో ఫుట్‌పాత్‌లు, రోడ్లు ఆక్రమించి వ్యాపారాలు చేస్తే జరిమానా విధిస్తామని హెచ్చరిస్తూ ఓ వైపు నగరపాలకసంస్థ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. మెయిన్‌రోడ్లు, రద్దీ ప్రాంతాల్లో అధికారులు ఆక్రమణలు తొలగించారు. అయితే తొలగించిన నాలుగు రోజులకే ఫుట్‌పాత్‌లు వదిలి ఏకంగా రోడ్లపైకి వచ్చి చేపట్టే వ్యాపారాలు షరా మామూలుగానే మారాయి.
స్పెషల్ డ్రైవ్
నగరంలో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు కలిగి స్తున్న ఫుట్‌పాత్‌లు, రోడ్లను ఆక్రమించి చేసేవ్యాపారాలపై ఇటీవల నగరపాలకసంస్థ దృష్టి సారించింది. రద్దీప్రాంతాలు, మెయిన్‌రోడ్ల వెంట ఫుట్‌పాత్‌లు, రోడ్ల ఆక్రమణలు తొలగించేందు కు అధికారులు ఇటీవల స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మంచిర్యాల, సిరిసిల్ల రూట్‌లలో రహదారులపై ఉన్న ఆక్రమణలు తొలగించి, సదరు వ్యాపారులకు హెచ్చరికలు కూడా జారీ చేశారు.
మళ్లీ సాధారణ స్థితికి...
బల్దియా చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌తో కొద్దిరోజులు విశాలంగా కనిపించిన రహదారులు నాలుగురోజులకే మళ్లీ పాతస్థితికి చేరుకున్నాయి. చాలా చోట్ల ఫుట్‌పాత్‌లు, రోడ్లు ఆక్రమించి చేసే వ్యాపారాలు కొనసాగుతున్నాయి. కరీంనగర్–మంచిర్యాల వైపు వెళ్లే మెయిన్ రోడ్ వెంట మళ్లీ ఆక్రమణలు దర్శనమిస్తున్నాయి. ఆదర్శనగర్ బోర్డు సమీపంలో ఏకంగా రోడ్లపైనే వ్యాపారాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఆదర్శనగర్ కాలనీలోకి వెళ్లే దారికి ఇరువైపులా వైన్‌షాప్‌ల మూలంగా ట్రాఫిక్‌కు తీవ్రఇబ్బంది కలుగుతోంది. ఇందుకు తోడు, అదే ప్రాంతంలో మెయిన్‌రోడ్ వెంట దాదాపు సగానికి ఆక్రమించి వ్యాపారాలు మళ్లీ ప్రారంభించారు. దీంతో పాత తరహాలోనే ఈ ప్రాంత వాసులు, ఆ రూట్‌లో వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ తిప్పలు తప్పడం లేదు.