
ఇటీవల జరిగిన శిక్షణలో ప్రిసైడింగ్, సెక్టోరియల్ అధికారులు
కరీంనగర్ అర్బన్: ఎన్నికలొచ్చాయంటే చాలు.. వివిధ రకాల పేర్లు డోలయమానంలో పడేస్తుంటాయి. అర్థం తెలియక అవగాహన లేని వారెందరో. ప్రిసైడింగ్ అధికారి, సెక్టోరియల్ అధికారి, రిటర్నింగ్ అధికారి, బూత్‌లెవల్ అధికారని పత్రికల్లో, అధికారుల సమావేశాల్లో వింటుంటాం.. అసలీ అధికారులేంటి. వీరు చేసే పనులేంటనేగా సందేహం.. ఎన్నికల్లో ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా అభ్యర్థులు ఎన్నికల కోడ్‌ను అతిక్రమించకుండా పర్యవేక్షించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక అధి కారులను నియమించింది. ఓటర్ల ప్రశాంత వాతావరణంలో ఓటును వినియోగించుకునేలా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, అభ్యర్థుల నామినేషన్ పత్రాల దాఖలు, పోలింగ్ ఓట్ల లెక్కింపు, ఎన్నికల ఫలితాలు వెలువరించే వరకు బూత్ లెవల్ అధికారుల నుంచి జిల్లా ఎన్ని కల అధికారి వరకు ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తిస్తుంటారు.
జిల్లా ఎన్నికల అధికారి
ప్రధాన ఎన్నికల అధికారి పర్యవేక్షణలో కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారు. భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాయబారిగా వ్యవహరిస్తుంటారు. సదరు సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలను జిల్లాలో అమలు చేస్తుంటారు. జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించడం, నామినేషన్ ప్రక్రియ, ఓటర్ల జాబితా ప్రకటన, పోలింగ్ కేంద్రాల్లో విధుల నిర్వహణకు అవసరమైన సిబ్బంది, జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం తదితర కార్యక్ర మాల్లో ఎన్నికల అధికారి పాత్ర ఎంతో ఉంటుంది.
రిటర్నింగ్ అధికారి
రెవెన్యూ డివిజన్ కేంద్రంలో ఆర్డీవో నియోజకవర్గ ఎన్నికల అధికారిగా వ్యవహరించనుండగా మిగతా నియోజకవర్గ కేంద్రాల్లో జిల్లాస్థాయి అధికారిని ఎన్నికల అధికారిగా నియమిస్తారు. ఆ నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్లను స్వీకరించడం, ఓటరు జాబితా ప్రకటన, పోలింగ్ కేంద్రాలపై పర్యవేక్షణ, అవసరమైన సిబ్బందిని నియమించడం, శిక్షణలు ఇవ్వడం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు.
సెక్టోరియల్ అధికారి
మొత్తం పోలింగ్ కేంద్రాలను పరిగణలోకి తీసుకుని సెక్టోరియల్ అధికారులను నియమిస్తారు. ఒక్కో సెక్టోరియల్ అధికారికి 6నుంచి 8 పోలింగ్ కేంద్రాలను అప్పగిస్తారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకోవడం, అక్కడి పరిస్థితులను బట్టి ఆయా చోట్ల 144 సెక్షన్ విధించే అధికారం ఉంటుంది.
ప్రిసైడింగ్ అధికారి
ప్రతి పోలింగ్ కేంద్రానికి ప్రిసైడింగ్ అధికారిని నియమిస్తారు. సహాయకుడిగా సహాయ ప్రిసైడింగ్ అధికారి ఉంటారు. ఈవీఎంలు, వీవీప్యాట్లు ఎన్నికలకు అవసరమైన సామగ్రిని పోలింగ్ కేంద్రాలకు తీసుకురావడం, మళ్లీ వాటిని స్ట్రాంగ్ రూంకు చేర్చడం వరకు వీరి బాధ్యత. పోలింగ్‌కేంద్రంలో అన్ని పనులు వీరి పర్యవేక్షణలోనే జరుగుతాయి.
బూత్ లెవల్ అధికారులు
కొత్తగా ఓటరు జాబితాలో చేరేవారిని, తొలగింపులు, తప్పుల సవరణకు అవసరమైన ఫారాలు ఇవ్వడం, ఆర్హులైనవారిని ఓటర్లుగా నమోదయ్యేలా చూడటం, ఓటర్ల జాబితా ప్రదర్శన, పోలింగ్ కేంద్రాల మార్పునకు సహకరించడం వీరి బాధ్యత. బీఎల్వోలుగా పంచాయతీ కారోబార్లు, వార్డ్ ఆఫీసర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు వ్యవహరిస్తున్నారు.
పోలింగ్ ఏజెంట్లు
ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థులు జరిగే పోలింగ్ కేంద్రాన్ని నేరుగా పరిశీలించలేరు. అందువల్ల ఎన్నికల సంఘం ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక పోలింగ్ ఏజెంట్‌ను నియమించుకోవడానికి అవకాశమిచ్చింది. సదరు కేంద్రంలోని ఓటరును మాత్రమే పోలింగ్ ఏజెంట్‌గా నియమిస్తారు. బోగస్ ఓట్లు పడకుండా వీరు జాబితా, ఓటరును సరిచూస్తారు.
సూక్ష్మ పరిశీలకులు
ఎన్నికల ఏర్పాట్లు, జరిగిన తీరు, ఎన్నికల పర్యవేక్షణపై నివేదికను రూపొందించి ఎన్నికల సంఘానికి పంపేందుకు సూక్ష్మ పరిశీలకులను నియమిస్తారు. వీరు మండలానికి ఒకరు మాత్రమే ఉంటారు. వీరంతా ఎన్నికల ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది.