
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచారని సంచలన ఆరోపణలు చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్రంలో బీజేపీ ఎంపీల గెలుపుపై తమకు అనుమానాలు ఉన్నాయని అన్నారు. అలాగే, బీహార్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది అంటూ జోస్యం చెప్పారు.
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తాజాగా సాక్షి టీవీతో మాట్లాడుతూ.. తెలంగాణలో బండి సంజయ్ సహా, బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచారు. ఆ మాటకు నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నారు. మాకు తెలంగాణ బీజేపీ ఎంపీల గెలుపుపై అనుమానాలున్నాయి. ఎలక్షన్ కమిషన్‌కు లేఖ రాస్తాం. మా నిజామాబాద్ జిల్లాలోనూ దొంగ ఓట్లున్నాయి. అది నేను నిరూపిస్తాను. మహారాష్ట్రలో కోటి దొంగ ఓట్లు నమోదు చేశారు.
నిజామాబాద్‌లోనూ మహారాష్ట్ర ప్రజలకు ఓట్లు ఉన్నాయి. కరీంనగర్‌లోనూ ఓ డబల్ బెడ్ రూమ్ ఇంట్లో 69 ఓట్లు ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది. ఓట్లు చోరీ చేసే అవసరం కేవలం బీజేపీకే ఉంది. బీహార్ ఎన్నికల్లోనూ అవకతవకలకు ఆస్కారం లేకుండా ప్రజల్ని చైతన్యపర్చేందుకే రాహూల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. రాహుల్ పాదయాత్రకు అనూహ్య స్పందన వస్తోంది. బీహార్‌లో కాంగ్రెస్ ప్రభంజనం రాబోతుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
