కరెంటు మీటరులో ఏదైనా సమస్య ఉందా.. బహుశా మీక్కూడా ఇలా జరుగుతుందేమో..!?

- - Sakshi

విద్యుత్‌శాఖలో మీటర్ల దందా..

వినియోగదారులకు తెలియకుండానే ఇతరులకు కనెక్షన్‌!

బిల్లు కట్టకపోవడంతో లైన్‌మెన్‌ విద్యుత్‌ సరఫరా నిలిపివేత..

లైన్‌మెన్ల మాయాజాలం.. అధికారుల ఉదాసీనత

మీటరు సర్వీసును ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి షిఫ్ట్‌..

సాక్షి, కరీంనగర్‌: విద్యుత్‌శాఖలో మీటర్ల దందా నడుస్తోంది. వినియోగదారులకు తెలియకుండానే మీటర్లను ఇతర ప్రాంతాలకు మార్చుతూ కనెక్షన్‌ ఇస్తూ లైన్‌మెన్లు మాయాజాలానికి పాల్పడుతున్నారు. ఇది తెలిసిన ఉన్నతాధికారులు మామూలుగా తీసుకుంటూ మెమోలతో సరిపెడుతున్నారు. ఇటీవల టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ కరీంనగర్‌ సర్కిల్‌ ఆఫీసు పరిధిలోని చిగురుమామిడి సెక్షన్‌న్‌లో చోటు చేసుకున్న ఓ సంఘటన కరీంనగర్‌ రూరల్‌ డీఈకి వినియోగదారుడు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

చిగురుమామిడి నివాసి అయిన సీహెచ్‌.రమేశ్‌కు చెందిన సర్వీసు నంబరు 3560ను అతని అనుమతి లేకుండానే అదే గ్రామంలో వేరొకచోట అమర్చారు. పంక్చర్‌ దుకాణానికి చెందిన కేటగిరి–2 మీటర్‌ను వేరే దుకాణంలో వినియోగదారుడి ప్రమేయం లేకుండా అమర్చడం వివాదాస్పదంగా మారింది. ఇది గమనించిన వినియోగదారుడు తన మీటర్‌ను ఇతరులకు ఎలా అమర్చారని లైన్‌మెన్‌పై కరీంనగర్‌ రూరల్‌ డీఈకు ఫిర్యాదు చేశాడు.

స్పందించిన డీఈ సదరు లైన్‌మెన్‌కు మెమోజారీ చేశారు. లైన్‌మెన్‌ సదరు వినియోగదారుడి మీటర్‌ను యధాస్థానంలో అమర్చేందుకు అంగీకరించాడు. ఇందుకుగాను అధికారులకు ఇచ్చిన ఫిర్యాదును వాపసు తీసుకోవాలంటూ వినియోగదారుడి నుంచి సంతకం తీసుకుని, మీటర్‌ను మార్చకుండా రేపు..మాపు అంటూ జాప్యం చేస్తున్నట్లు తెలిసింది. అంతేకాకుండా ఈ సర్వీసుపై బిల్లు బకాయి ఉందని, కేసు చేయిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం.

ఇలాంటి మీటర్ల దందా సర్కిల్‌ పరిధిలో అనేక చోట్ల కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న అపవాదును మూటగట్టుకుంటున్నారు. కరీంనగర్‌లో సైతం విద్యుత్‌ మీటర్లు ఒకచోట..ఇంటి నంబర్లు మరోచోట ఉన్నట్లు సమాచారం. కొంతమంది లైన్‌మెన్‌లు చేస్తున్న తప్పిదాలతో విద్యుత్‌ శాఖలోని సిబ్బందికి అపవాదు వస్తోందని మరికొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మెమో జారీ చేశాం..
చిగురుమామిడికి చెందిన రమేశ్‌ బిల్లు కట్టకపోవడంతో లైన్‌మెన్‌ విద్యుత్‌ సరఫరా నిలిపివేశాడు. అయితే ఈ సర్వీసును ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి షిఫ్ట్‌ చేశాడని వినియోగదారుడు కరీంనగర్‌ రూరల్‌ డీఈకి ఫిర్యాదు చేశాడు. క్షేత్రస్థాయిలో పరిశీలించగా సర్వీసు వేరే ప్రాంతానికి షిఫ్ట్‌ చేసినట్లు తేలింది. వినియోగదారుడి అనుమతి లేకుండా లైన్‌మెన్‌ సర్వీసును షిఫ్ట్‌ చేయడం తప్పుగా భావించి ఉన్నతాధికారుల సూచన మేరకు లైన్‌మెన్‌కు మెమో జారీ చేసి విచారణ చేపడుతున్నాం. అయినప్పటికీ లైన్‌మెన్‌, వినియోగదారుడు ఒక ఒప్పందానికి వచ్చినట్లు తెలిసింది. – ప్రకాశ్‌, ఏఈ, చిగురుమామిడి

Read latest Karimnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top