పదిలంగా చదివేద్దాం!
– సమీపిస్తున్న పదోతరగతి పబ్లిక్ పరీక్షలు– ఒత్తిడి లేకుండా రాయాలంటున్న నిపుణులు
– పట్టుదల ఉంటే విజయం మీదేనంటున్న సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ – మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు
పదో తరగతి.. విద్యార్థి జీవితంలో ఎదిగేందుకు తొలిమెట్టు. తన భవిష్యత్‌కు కీలక మలుపు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధిస్తే ఉన్నత చదువులకు మంచి అవకాశం ఉంటుంది. మార్చి 14 నుంచి ప్రారంభమయ్యే ఈ పరీక్షలు మార్కులతో పోటీ మాత్రమే కాకుండా, క్రమశిక్షణ, పట్టుదల, సమయపాలన వంటి విలువలను పరీక్షించే సందర్భం. సమాజం మొత్తం ఈ పరీక్షలను ఒక ప్రమాణంగా చూస్తుంది. పరీక్షలకు మరో 20 రోజులే సమయం ఉన్న నేపథ్యంలో ఏ సజ్జెక్టుపై పట్టు పెంచుకోవాలో తెలియక విద్యార్థులు తర్జనభర్జన పడుతుంటారు. సమయం దగ్గర పడుతున్న కొద్ది వారిపై అధిక ఒత్తిడి, మానసిక భారం పెరుగుతుంది. ఈ దశలో సరైన ప్రణాళిక, సమగ్ర పునర్విమర్శ, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం ఎంతో అవసరం. భాషా సబ్జెక్టుల్లో భావవ్యక్తీకరణకు, గణితం, సైన్స్‌లో సూత్రాల అవగాహనకు, సోషల్‌లో విశ్లేషణాత్మక దృష్టికి ప్రాధాన్యం ఇవ్వాలి. పరీక్షలు భయపడాల్సినవి కాదు.. సిద్ధతను నిరూపించుకునే అవకాశం మాత్రమే అని తల్లిదండ్రులు ఆత్మవిశ్వాసాన్ని నింపాలి. మార్కులకే పరిమితం కాకుండా నేర్చుకున్న జ్ఞానం భవిష్యత్‌కు పునాది అవుతుందని సూచించాలి. సమతుల్య దృష్టితో ముందుకు సాగితే పదో తరగతి పరీక్షలు విజయానికి ద్వారం తెరుస్తాయని గుర్తించాలి. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు పదోతరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు ఎలా సన్నద్ధం కావాలి..? ఏఏ పాఠాలను ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది..? అనే అంశాలతో ఆయా సబ్జెక్టుల స్టేట్, డిస్ట్రిక్ రిసోర్సు పర్సన్లు, విషయ నిఫుణుల సలహాలు, సూచనలు..
–సప్తగిరికాలనీ(కరీంనగర్)


