ఇక వార్డుసభ్యులకు శిక్షణ
జిల్లాలోని పంచాయతీల వివరాలు
కరీంనగర్‌రూరల్: గ్రామపంచాయతీల్లో కొలువుదీరిన నూతన పాలకవర్గాలకు విధులు, పరిపాలన అంశాలపై ప్రభుత్వం శిక్షణా తరగతులు నిర్వహిస్తోంది. గతేడాది డిసెంబరులో పదవీబాధ్యతలు చేపట్టిన సర్పంచులకు గత నెల నుంచి శిక్షణ కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణతో వాయిదా పడిన సర్పంచుల శిక్షణా తరగతులను తిరిగి ఈ నెల 17నుంచి కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉపసర్పంచులు, వార్డు సభ్యులకు ఈ నెల 23నుంచి వచ్చేనెల 30వరకు మండలకేంద్రాల్లో శిక్షణా తరగతులు ఐదు విడతల్లో నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలోని మొత్తం 316 గ్రామపంచాయతీలో 2,940మంది వార్డుసభ్యులున్నారు. 316 మంది ఉపసర్పంచులు, 2,624 మంది వార్డుసభ్యులకు శిక్షణ ఇచ్చేందుకు ఇటీవల 25మంది పంచాయతీ కార్యదర్శులు మాస్టర్‌ట్రేనర్లుగా హైదరాబాద్‌లో శిక్షణపొందారు. ఆయా మండలాల్లోని ఉపసర్పంచులు, వార్డుసభ్యులకు మండల కేంద్రాలు, రైతువేదికల్లో మాస్టర్ ట్రైనర్లు శిక్షణ ఇవ్వనున్నారు.
పంచాయతీ రాజ్ చట్టంపై అవగాహన
● నూతన పంచాయతీరాజ్ చట్టం– 2018 ప్రకారం పంచాయతీల అధికారాలు, పాలకవర్గాల బాధ్యతలు, విధులపై అవగాహన కల్పిస్తారు.
● సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డుసభ్యుల విధులు, బాధ్యతలు, పంచాయతీ సమావేశాలు, గ్రామసభల నిర్వహణ తీరును వివరిస్తారు.
● తడిపొడి చెత్త సేకరణ, కంపోస్టుషెడ్ నిర్వహణ, సేంద్రియ ఎరువుతయారీతో పంచాయతీలకు ఆదాయం, మురికి కాలువలను శుభ్రం చేయడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంపై అవగాహన కల్పిస్తారు.
● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా పంచాయతీలకు వస్తున్న నిధులతో చేపట్టనున్న పనులు, సంక్షేమ, అభివృద్ధి పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయడం, వీబీజీ రామ్‌జీ పథకంపై వివరిస్తారు.
● జనన, మరణాల నమోదు, ఈ– పాలన,పంచాయతీ రికార్డుల నిర్వహణ, పన్నుల వసూళ్లు, వసతుల కల్పనపై శిక్షణ ఇస్తారు.
మొత్తం గ్రామపంచాయతీలు: 316
ఉపసర్పంచులు: 316, వార్డుసభ్యులు: 2,624
మాస్టర్ శిక్షకులు: 25


