విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
కరీంనగర్‌టౌన్: వచ్చేనెల 14వ తేదీనుంచి పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులపై ఉపాధ్యాయులు, ప్రత్యేకాధికారులు శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. గురువారం మండల విద్యాధికారులు, ప్రత్యేక అధికారులతో సమీక్షించారు. ఈ నెల రోజులు పదోతరగతి విద్యార్థులకు చాలా కీలకమన్నారు. ప్రతివారం ప్రత్యేకాధికారులు తమకు కేటాయించిన పాఠశాలలను సందర్శించాలన్నారు. నెల రోజులపాటు ఉపాధ్యాయులు, విద్యాశాఖ సిబ్బందికి సెలవులు రద్దు చేయాలని, అత్యవసరమైతే మరొకరికి బాధ్యతలు అప్పగించాలన్నారు. పదోతరగతి విద్యార్థులు ప్రత్యేక తరగతులకు హాజరయ్యేలా చూడాలన్నారు. హాస్టల్లో ఉండేవారు అత్యవసరమైతే తప్ప ఇంటికి వెళ్లేందుకు అనుమతించకూడదన్నారు. అడిషనల్ కలెక్టర్, జిల్లా విద్యాధికారి అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ విద్యాశాఖ మార్గదర్శకాల ప్రకారం 10వ తరగతి పరీక్షలకు విద్యార్థులను ఎలా సిద్ధం చేస్తున్నారో ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలన్నారు.
పీఎం శ్ఙ్రీ పెండింగ్ బిల్లులపై సమీక్ష
జిల్లాలో పీఎంశ్రీ కార్యక్రమం కింద ఎంపికై న పాఠశాలల్లో పెండింగ్ బిల్లుల అంశంపై విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ట్రెజరీశాఖ అధికారులతో కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే సమీక్షించారు. వేతన బిల్లులు మినహా అన్ని రకాల చెల్లింపులు వెనువెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్ బాబు, విద్యాశాఖ కోఆర్డినేటర్లు అశోక్ రెడ్డి, మిల్కూరి శ్రీనివాస్, ఆంజనేయులు పాల్గొన్నారు.


