చేజేతులా..! | - | Sakshi
Sakshi News home page

చేజేతులా..!

Feb 20 2026 6:53 AM | Updated on Feb 20 2026 6:53 AM

చేజేతులా..!

చేజేతులా..!

● బల్దియాను చేజార్చుకున్న కాంగ్రెస్‌ ● సమన్వయ లోపం, ఆధిపత్యపోరు ● అధిష్టానానికి పరస్పర ఫిర్యాదులు?

కరీంనగర్‌ కార్పొరేషన్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో గెలి చేందుకు అవకాశాలు ఉండి, బల్దియాను చేజార్చుకోవడం ఎలాగో కరీంనగర్‌లో కాంగ్రెస్‌ను చూస్తే తెలుస్తుంది. సమన్వయ లోపం, వ్యక్తిగత ఆధిపత్యం, నేతల మధ్య వర్గపోరు. వెరసి అధికార కాంగ్రెస్‌ పార్టీని నగరంలో అధికారంలోకి రానీయకుండా నిలిపివేశాయి. బల్దియా సన్నాహక సమావేశాల నుంచి మొదలు అభ్యర్థుల ఎంపిక, రెబల్స్‌ బెడద, ఎన్నికల ప్రచారం, క్యాంప్‌ రాజకీయాలు, అన్నింట్లోనూ వ్యక్తిగత ఆధిపత్యానికి, వర్గపోరుకు పెద్దపీట వేయడంతో కాంగ్రెస్‌ చేజేతులా బల్దియాను చేజార్చుకొందనే అపవాదును మూటకట్టుకుంది.

కనిపించని సమన్వయం

అంతర్గత ప్రజాస్వామ్యం అధికంగా ఉండే కాంగ్రెస్‌లో సమన్వయం భూతద్దం పెట్టినా కనిపించదు. అధిష్టానం మెట్టికాయలు వేసిన ప్రతిసారి కలిసినట్లు కనిపించినా, అది ఫొటోలకే పరిమితమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం కరీంనగర్‌లో కాంగ్రెస్‌ పరిస్థితి గందరగోళం మారింది. నియోజకవర్గాన్ని సమన్వయ పరిచే బాధ్యతను ఏ ఒక్క నాయకుడు తీసుకోకపోవడంతో, అధికారంలోకి వచ్చినా కరీంనగర్‌లో కాంగ్రెస్‌ పరిస్థితి ప్రతిపక్షం కన్నా అన్యాయంగా మారింది. ఈ క్రమంలో నగరపాలకసంస్థ ఎన్నికలు పరిస్థితిని మరింత దిగజార్చాయి.

తిలా పాపం.. తలా పిడికెడు

‘అభ్యర్థుల ఎంపికతో ఎనిమిది నుంచి పది సీట్లు కోల్పోయాం’.. ఇటీవల పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు మీడియా సమావేశంలో ఓ ప్రశ్నకు సమాధానంగా చేసిన వ్యాఖ్యలు ఇవీ. స్థానిక ఎన్నికల్లో సహజంగానే అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది. కానీ ఆ అనుకూలతను సొమ్ము చేసుకొనే పరిస్థితిలో కాంగ్రెస్‌ లేకుండా పోయింది. అభ్యర్థుల ఎంపికలో సమన్వయం పూర్తిగా కొరవడగా, నేతల వ్యవహారం తిలాపాపం తలా పిడికెడు అన్న చందంలా మారింది. ఒకరికి టికెట్‌ వద్దు అని ఒక నాయకుడు, తమ వారికే టికెట్‌ రావాలని మరొకరు, సర్వే చేశాం వందశాతం గెలుస్తున్నాడంటూ ఇంకొకరు.. ఇలా అభ్యర్థుల ఎంపిక పాపంలో నేతలంతా తలా ఓ చేయి వేశారు. దీనితో 25 సీట్లు గెలుస్తామనుకొన్న కాంగ్రెస్‌ 14 వద్దనే ఆగిపోయిందని పార్టీ శ్రేణులు ఆవేదన చెందుతున్నారు.

క్యాంపు రాజకీయాల్లోనూ వెనుకడుగే

మేయర్‌ పీఠం కోసం వేసిన క్యాంపు రాజకీయాల్లోనూ కాంగ్రెస్‌ కాస్త వెనుకబడింది. 14 మంది కాంగ్రెస్‌ కార్పొరేటర్లతో పాటు, స్వతంత్రులు, బీఆర్‌ఎస్‌, ఎక్స్‌అఫీషియో సభ్యులు కలుపుకొని ఒక దశలో బలం 35కు చేర్చుకుంది. ఒక్క ఫార్వర్డ్‌ బ్లాక్‌ కార్పొరేటర్‌ను బీజేపీ నుంచి కాంగ్రెస్‌ లాక్కుంటే, బీజేపీ నేతలు ఏకంగా బీఆర్‌ఎస్‌ శిబిరానికే ఎసరు పెట్టారు. అనూహ్యంగా బీఆర్‌ఎస్‌ ప్లేట్‌ఫిరాయించడంతో కాంగ్రెస్‌కు మేయర్‌ పీఠం అందని ద్రాక్షగా మారింది. అలా రాష్ట్ర ప్రభుత్వ ‘అధికారం’పై కేంద్ర ప్రభుత్వ ‘అధికారం’ పై చేయి సాధించింది.

ఎదుటి వారిపై నెపం నెట్టేందుకే

కరీంనగర్‌లో వైఫల్య నెపాన్ని ఎదుటి వారిపై నెట్టే క్రమంలో పలు అంశాలపై అధిష్టానానికి పలువురు నేతలు ఫిర్యాదు చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. తాము అంతా సక్రమంగా చేశామని, ఎదుటి వాళ్ల కారణంగానే నష్టం వాటిల్లిందని చెప్పడానికే నేతలు ప్రయత్నించినట్లు సమాచారం. ఎన్నికలు జరిగిన ఏడు కార్పొరేషన్లలో కేవలం కరీంనగర్‌ బల్దియా చేజారడంపై పార్టీ హైకమాండ్‌ సైతం ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement