గాంధారి: అవమానం భరించలేక ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సదాశివనగర్ సీఐ వీరయ్య, స్థానిక ఎస్సై మహేందర్ ఆదివారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 22న గాంధారి మండల కేంద్రానికి చెందిన బుర్రి సంతోష్ అనే వ్యక్తిని ఓ మహిళకు ఫోన్ చేశావని ఆరోపిస్తూ పాత పోలీస్‌స్టేషన్ సమీపంలో మహిళ కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు. దీంతో అతను అవమానం భరించలేక అదే రోజు రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. నిందితులు సంగీత, రాఘవేందర్, రక్షిత్, దుర్గాప్రసాద్, శ్రీకాంత్ లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.
వర్ని: మండలంలోని హుమ్నాపూర్‌లో ఓ వ్యక్తి అదృశ్యమైనట్లు వర్ని ఎస్సై వంశీ కృష్ణారెడ్డి ఆదివారం తెలిపారు. ఎ స్సై కథనం ప్రకారం.. గ్రా మానికి చెందిన మామిడి హన్మాగౌడ్(55) ఈ నెల 3న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
రుద్రూర్: పొతంగల్ మండలం సుంకిని గ్రామ శివారులో మంజీరా నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఆదివారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 11 ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. సుంకిని ఎక్స్‌రోడ్డు వద్ద ఇసుక లోడ్‌తో వెళ్తున్న మూడు ట్రాక్టర్లను పట్టుకున్నారు. మంజీరా నదిలో ఇసుకను లోడ్ చేస్తున్న మరో ఎనిమిది ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ట్రాన్స్‌ఫార్మర్ ధ్వంసం
ఇందల్వాయి: మండలంలోని చంద్రాయన్‌పల్లి శివారులోని కొట్ల దాసు వ్యవసాయ పొలంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను దుండగులు ఆదివారం వేకువ జామున ధ్వంసం చేశారు. అందులో ఉన్న కాపర్ కాయిల్స్‌ను అపహరించినట్లు స్థానిక రైతులు తెలిపారు. ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో రైతులు ఫిర్యాదు చేశారు. ఇకనైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.


