ఆజామాబాద్‌లో రెండేళ్లుగా..
గొడవలు తగ్గుముఖం పట్టాయి
యువత సహకరించారు
● ఆజామాబాద్, గండిమాసానిపేటలలో
మద్య నిషేధం
● మద్యం విక్రయిస్తే రూ.50 వేల జరిమానా
● ఏకగ్రీవంగా తీర్మానాలు చేసిన ప్రజలు
ఎల్లారెడ్డిరూరల్: యువత మేలు, ఊరి బాగు కోసం ఆ గ్రామాలు తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలనిస్తోంది. యువ త మద్యం మత్తులో జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, కుటుంబాల్లో తగాదాలు జరుగుతున్నాయని భావించిన గ్రామపెద్దలు.. సంపూర్ణ మద్య నిషేధం విధిస్తూ తీర్మానించారు. తద్వారా ఎల్లారెడ్డి మండలంలోని ఆజామాబాద్, గండిమాసానిపేట గ్రామాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి.
అతిక్రమిస్తే రూ.50 వేలు.. పట్టిస్తే రూ.5 వేలు
ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని గండిమాసానిపేట, మండలంలోని ఆజామాబాద్ గ్రామాల్లో గతంలో విచ్చలవిడిగా మద్యం దొరికేది. దీంతో యువత తాగుడుకు బానిసలయ్యారు. పనులు చేయకుండా ఉంటుండడంతో తరచూ కుటుంబాలలో తగాదాలు చోటు చేసుకున్నాయి. గ్రామస్తులు చాలామంది పనులకు వెళ్లకపోవడంతో ఆర్థిక ఇబ్బందులూ తీవ్రమయ్యాయి. దీనంతటికీ కారణం మద్యమేనని గ్రహించిన గ్రామపెద్దలు.. యువకులతో చర్చించి మద్య నిషేధం విధిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. దీనిని అతిక్రమించిన వారికి రూ.50 వేలు జరిమానా విధిస్తామని, మద్యం విక్రయిస్తున్నారనే సమాచారం అందించిన వారికి రూ.5 వేల నగదు బహుమతి అందిస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయానికి గ్రామస్తులంతా కట్టుబడి ఉండాలనే నిబంధన విధించారు.
ఎల్లారెడ్డి మండలంలోని ఆజామాబాద్ గ్రామంలో 2024 సెప్టెంబర్‌లో మద్య నిషేధం విధిస్తూ తీర్మానం చేశారు. తాజాగా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని గండిమాసానిపేట గ్రామంలో రెండురోజుల క్రితం మద్యం విక్రయించొద్దని నిర్ణయం తీసుకున్నారు.
మద్య నిషేధం తర్వాత గ్రామంలో చాలా వరకు గొడవలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం ఎవరి పనులు వారు చేసుకుంటుండడంతో ఇతరుల మీద ఆధారపడే బాధ తప్పింది. గ్రామంలో కుటుంబాలు చాలా సంతోషంగా ఉంటున్నాయి. – పండరి, ఆజామాబాద్
యువత మద్యం మత్తులో ఉంటున్నారని గ్రామంలో మద్య నిషేధం విధించాం. గ్రామస్తులతోపాటు యువత కూడా గ్రామ పెద్దల నిర్ణయానికి సహకరిస్తూ కట్టుబడి ఉంటామని ఒప్పుకున్నారు.
– వహీద్, గండిమాసానిపేట


