● రోగులు కోలుకునేలా పర్యవేక్షించాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి క్రైం: కామారెడ్డిని టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దే కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ వైద్యులు భాగస్వాములు కావాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పిలుపునిచ్చారు. ఈ ఏడాది చివరి నాటికి జిల్లాలో టీబీ వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. టీబీ నిర్మూలన కార్యాచరణ ప్రణాళిక అమలుపై సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. వ్యాధిపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. అనుమానిత వ్యక్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి, నిర్ధారణ జరిగిన ప్రతి రోగికి నాణ్యమైన చికిత్స అందేలా చూడాలన్నారు. వ్యాధి ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలన్నారు. టీబీ రోగులతో సన్నిహితంగా ఉండే వారందరికీ పరీక్షలు చేయాలన్నారు. హెచ్‌ఐవీ, మధుమేహంలాంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి తప్పనిసరిగా టీబీ స్క్రీనింగ్ నిర్వహించాలన్నారు. రోగులు పూర్తిస్థాయిలో మందులు వాడేలా, వందశాతం కోలుకునేలా పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. పౌష్టికాహార సహాయం కోసం ప్రభుత్వం అందించే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ నిధులు అర్హులైన రోగుల బ్యాంకు ఖాతాల్లో సకాలంలో జమయ్యేలా చూడాలన్నారు.
జలసిరి పనులు వేగవంతం చేయాలి
వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు నిర్ణయించిన జలసిరి పనులను వేగంగా చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. వివిధ శాఖల అధికారులతో సోమవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. భూగర్భ జలాలను పెంపొందించడమే జలసిరి పనుల ముఖ్య ఉద్దేశమన్నారు. వచ్చేనెల 15 నాటికల్లా జిల్లాలోని ఒక్కో జీపీ పరిధిలో 20 చొప్పున జిల్లాలో మొత్తం 10,640 ఇంకుడు గుంతలు, జీపీకి 2 చొప్పున మొత్తం 1,064 పంట కుంటలు, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యంలో 1,638 బోరుబావుల రీచార్జ్ పిట్‌లు, ప్రతి గ్రామానికి ఒకటి చొప్పున ఊటకుంటల పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. వీబీ జీ రామ్‌జీ పథకం కింద చేపట్టే ఆయా పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఇందుకోసం ప్రతి గ్రామానికి 60 మంది కూలీలను సమీకరించి వారికి పనుల ప్రాధాన్యతను వివరించాలని ఎంపీడీవోలకు సూచించారు.


