గెలుపు గుర్రాల వేట! | - | Sakshi
Sakshi News home page

గెలుపు గుర్రాల వేట!

Jan 22 2026 6:58 AM | Updated on Jan 22 2026 6:58 AM

గెలుపు గుర్రాల వేట!

గెలుపు గుర్రాల వేట!

గెలుపు గుర్రాల వేట! కామారెడ్డిలో బలంగా ప్రధాన పార్టీలు.. ముందస్తు ప్రచారం

బాన్సువాడలో..

అన్ని పార్టీల్లోనూ

భారీగా ఆశావహులు

అభ్యర్థుల ఎంపికపై

కసరత్తు చేస్తున్న పార్టీలు

మున్సిపల్‌ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దాదాపు అన్ని పార్టీలలోనూ ఆశావహులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులను ఎంపిక చేయడం ఆయా పార్టీల నేతలకు సవాల్‌గా మారనుంది.

– సాక్షి ప్రతినిధి, కామారెడ్డి

కామారెడ్డి మున్సిపాలిటీపై మూడు ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. ప్రధానంగా అధికార కాంగ్రెస్‌ పార్టీ అన్ని వార్డులపై ఫోకస్‌ చేస్తోంది. ఆయా వార్డుల్లో టికెట్టు ఆశిస్తున్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఒక్కో వార్డునుంచి ఇప్పటికే నలుగురైదుగురు దరఖాస్తు చేసుకున్నారు. ఎవరైతే గెలుస్తారన్న దాని గురించి ముఖ్య నేతలు ఆరా తీస్తున్నారు. ఇటీవల బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన పలువురు మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్‌ గూటికి చేరారు. వారికి తప్పకుండా టికెట్లు ఇస్తారని తెలుస్తోంది. మరికొన్ని వార్డుల్లో బలమైన అభ్యర్థుల కోసం ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తున్నట్టు సమాచారం. 2020 ఎన్నికల్లో బల్దియాను కై వసం చేసుకున్న బీఆర్‌ఎస్‌ పార్టీ.. ఈసారి కూడా చైర్‌పర్సన్‌ పీఠం కై వసం చేసుకోవాలన్న లక్ష్యంతో సాగుతోంది. పట్టణంలో బలమైన నాయకత్వం ఉందని, ఎలాగైనా గెలుస్తామన్న ధీమాతో ఆ పార్టీ నేతలున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో గణనీయమైన స్థాయిలో ఓట్లు సాధించిన బీజేపీ సైతం కామారెడ్డి బల్దియాపై జెండా ఎగురవేయాలని ఉవ్విళ్లూరుతోంది. మున్సిపాలిటీని తన ఖాతాలో వేసుకోవడం కోసం ఆ పార్టీ నాయకత్వం పావులు కదుపుతోంది.

మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణ దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే తుది ఓటరు జాబితాను ప్రకటించారు. వార్డులవారీగా రిజర్వేషన్లు సైతం ఖరారయ్యాయి. రేపో మాపో షెడ్యూల్‌ కూడా విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మూడు ప్రధాన పార్టీలు అన్ని వార్డుల్లో అభ్యర్థులను దింపడానికి ఏర్పాట్లు చేస్తున్నాయి. కాగా ఆయా పార్టీల టికెట్టుపై పోటీ చేయడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. మెజారిటీ స్థానాలు సాధించి బల్దియాలలో తమ పార్టీ జెండా ఎగురవేయాలని భావిస్తున్న ఆయా పార్టీలు.. గెలుపు గుర్రాల వేట మొదలుపెట్టాయి. ఆశావహులు ఎక్కువగా ఉండడంతో.. ఆయా వార్డుల్లో పట్టు ఎవరికి ఉంది, ప్రత్యర్థి పార్టీ నుంచి ఎవరు నిలబడతారు, వారిని ఢీకొట్టి గెలిచే సత్తా ఎవరికి ఉందన్న దానిపై ముఖ్య నేతలు ఆరా తీస్తున్నారు. గెలుస్తారన్న అంచనాలు ఉన్న వారిని ప్రచారం చేసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే పలువురు ప్రచారం కూడా మొదలుపెట్టారు. పార్టీ టికెట్టు తమకే వస్తుందన్న నమ్మకం ఉన్న పలువురు ఇంటింటికీ తిరుగుతున్నారు.

ఎల్లారెడ్డిలోనూ తీవ్ర పోటీ!

ఎల్లారెడ్డి పట్టణంలో కాంగ్రెస్‌ పార్టీలో టికెట్ట కోసం పోటీ నెలకొంది. గెలిచే వారికే టికెట్లు ఇస్తామని ముఖ్య నేతలు చెబుతున్నారు. మరోవైపు పట్టణంపై బీఆర్‌ఎస్‌ పార్టీకి పట్టు ఉంది. బల్దియా ఎన్నికలలో గెలిచి పట్టు నిలుపుకోవాలన్న లక్ష్యంతో ఆ పార్టీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఎల్లారెడ్డి బల్దియా ఎన్నికలలో సత్తా చాటేందుకు బీజేపీ సైతం వ్యూహాలు రచిస్తోంది.

బాన్సువాడ పట్టణంలో రాజకీయం రసవత్తరంగా మారింది. గతంలో రెండు మినహా మిగతా స్థానాలన్నీ బీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. అప్పుడు గెలిచిన వారిలో ఒకరిద్దరు మినహా ప్రస్తుతం అందరూ కాంగ్రెస్‌ గూటికి చేరారు. ఇక్కడ కాంగ్రెస్‌లో రెండు గ్రూపులు ఉన్నాయి. దీనిని సొమ్ము చేసుకునేందుకు బీఆర్‌ఎస్‌ పావులు కదుపుతోంది. బీజేపీ కూడా పోటీ ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది.

నాలుగు మున్సిపాలిటీల్లో కొందరు ఇప్పటికే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. ఇంటింటికీ తిరుగుతూ తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో ఆయా వార్డుల్లో రాజకీయం వేడెక్కింది. ఒకరి వెంట ఒకరు అన్నట్టు ఆశావహులు ఇంటింటికీ తిరుగుతున్నారు. కొందరు వాట్సాప్‌ మెస్సేజ్‌లు, మరికొందరు ఫోన్‌ కాల్స్‌ ద్వారా ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. పట్టణాల్లో ఎక్కడ చూసినా ఎన్నికల వాతావరణమే కనిపిస్తుంది. టికెట్టు రాకుంటే ఇండిపెండెంట్‌గా బరిలో దిగేందుకు కూడా కొందరు రెడీ అయి ప్రచారం చేస్తున్నారు.

కొత్తగా ము న్సిపాలిటీగా ఆవిర్భవించిన బి చ్కుందలోనూ రాజకీయాలు వేడెక్కాయి. కొత్త బల్దియాపై పార్టీ జెండా ఎగురవేసేందుకు అధికార పార్టీ పావులు కదుపుతోంది. బీఆర్‌ఎస్‌ సైతం ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బలమైన అభ్యర్థులను నిలపడం ద్వారా బల్దియాను కై వసం చేసుకోవాలని యోచిస్తోంది. అన్ని వార్డుల్లో అభ్యర్థులను నిలబెట్టేందుకు బీజేపీ నాయకత్వం కసరత్తు చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement